17-11-2025 05:26:47 PM
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కశ్మీర్ గడ్డ వాసులు..
కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని కశ్మీర్ గడ్డ ప్రాంతంలో టూ టౌన్ ఎదురుగా, ఆర్బీ స్వీట్ హౌస్ పక్కన ప్రముఖ విద్యా సంస్థలు, మస్జిద్, ప్రార్థన ఆలయాలకు అతి సమీపంలో, ముఖ్యంగా జనవాసాల్లో బార్/వైన్ దుకాణం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ, సోమవారం కశ్మీర్ గడ్డ నివాసులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు షేక్ షబ్బీర్, ఖాజా షా నవాజ్, సాజిద్ ఖాన్ లు మాట్లాడుతూ... తమ కాలనీ ప్రశాంతమైన ప్రాంతం, ఇక్కడ పిల్లలు, సీనియర్ సిటిజన్లు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే వైన్స్ సమీపంలో ఒక మసీదుతో పాటు ప్రముఖ విద్యాసంస్థలు స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి.
విద్యార్థులు, కుటుంబాలతో నిత్యం జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం తెరవడం అశాంతికి దారితీస్తుంది. నివాస యోగ్యత కలిగిన ప్రదేశంలో బార్/వైన్ దుకాణం ద్వారా నిత్యం మద్యం సేవించే మందుబాబుల ఆగడాలతో కుల, మత పరమైన గొడవలు జరిగే ప్రమాదం ఉంది. ఈవైన్ షాపు ఏర్పాటుతో మహిళలు, పిల్లలు, వృద్ధులకు భద్రతా సమస్యలు తలెత్తుతాయి. సమీపంలో ప్రార్థనా స్థలం (మసీదు) ఉండటం వల్ల ఈ ప్రదేశం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. మునిసిపల్, ఎక్సైజ్ మార్గదర్శకాల ప్రకారం, మద్యం దుకాణాలు సాధారణంగా పాఠశాలలు, మతపరమైన సంస్థలు, జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టడం శోచనీయమన్నారు.
ఈ ప్రాంతంలో బాలికల హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయని.. దీని వలన బార్/వైన్ దుకాణంతో పాటు వైన్ సిట్టింగ్ ఏర్పాటుతో, స్థానిక ప్రజలకు, ప్రజా రవాణాకు నిత్యం అసౌకర్యంగా మారుతుంది. కావున జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ఈవైన్స్ షాపు అనుమతులను రద్దు చేయాలని, ఈవైన్ షాప్ ను మరో చోటుకి తరలించేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో షేక్ మహబూబ్ పాషా, ఖాజా జమాలొద్దిన్, జి. కృష్ణ, డాక్టర్ జయంతి, ఖాజా మినహజోద్దీన్ అక్తర్ అలీ, యూసుఫ్, హాబీబ్, హాజీ తదితరులు ఉన్నారు.