30-10-2025 07:46:22 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో సీతారాం తండా వాసులు గత సంవత్సరం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. గత సంవత్సరం ఆగస్టు 31 రాత్రి కురిసిన వర్షానికి సీతారాం తండాలో ఇండ్లు పశువులు అన్ని నీట మునిగిన దుస్థితి నుండి తేరుకోక ముందే గత రెండు రోజుల నుండి కురుస్తున్న మొంథ తుఫాన్ వల్ల ఆకెరు వాగు పొంగి పొర్లుతున్న భయానికి తండవాసులు ఆకెరు వాగు ఉధృతి అధికమైతే పశువులను కాపాడుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని తెల్లవారుజామున మూడు గంటల నుండి వాళ్లకి ఉండబడిన బర్లు, గొర్లను ,మూగజీవాలను జాతీయ రహదారి 365 పై దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకు లో ఉంచడం జరిగింది.
రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేక భయాందోళనకు గురై తండావాసులు రోడ్డు మీదకు వచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి రోడ్డుపైనే బయటయించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా తండా వాసులందరికీ మేట్ట ప్రాంతంలో పునరవాసము ప్రభుత్వమే భూములు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రహదారికి ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. విషయాన్ని తెలుసుకొని స్థానిక సీఐ, అదనపు ఎస్ఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకొని సీతారామ తండా వాసులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.