30-10-2025 10:33:47 PM
మందమర్రి (విజయక్రాంతి): ఒకవైపు మొంథా తుఫాన్ తో ఆకాల వర్షం, దీనికి తోడు బారి ఈదురుగాలుల మూలంగా మండలంలోని వరి పంట నేలకొరిగింది. తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈదురు గాలులతో మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వరి పంట నేల రాలి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతన్నలకు మరో పక్షం రోజుల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉండగా అకాల వర్షాల దాటికి చేతికి వచ్చిన పంట నేలపాలు అయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగి రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
మరొ పదిహేను రోజుల్లో పంట చేతికి వచ్చి, అధిక దిగుబడి వచ్చి అప్పులు తీరుతాయని ఆశించిన అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయని పలువురు రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా మండల వ్యాప్తంగా సాగు చేసిన పత్తి పంట అకాల వర్షాలతో వర్షార్పణ మైందని పలువురు పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పదుల సంఖ్యలో పత్తి చేనులు కౌలుకు తీసుకుని సాగు చేసినప్పటికీ అకాల వర్షం మూలంగా పంట ఎర్రబారి పనికిరాకుండా పోయిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పంట సాగు చేసినప్పటికీ దిగుబడి అటు ఉంచి పంట పనికిరాకుండా పోయిందని పలువురు పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ అన్నదాతలకు అతివృష్టి, ఆనావృష్టి ల మూలంగా ప్రతి సంవత్సరం నష్టం తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
యువరైతు కంట తడి...
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి మండలంలోని నార్లాపూర్ గ్రామానికి పంట రైతు పంట నష్ట పోయి కంట తడి పెట్టాడు. గ్రామానికి చెందిన అర్కటీ రవీందర్ తనకున్న 4 ఎకరాలలో వరి సాగు చేశారు. అకాల వర్షం, ఈదురు గాలులకు చేతికొచ్చిన పంట నేలమట్టమయ్యింది. అప్పు చేసి, పెట్టుబడి పెట్టి, ఆరుకాలం శ్రమించి పండించిన పంట, చేతికొచ్చే సమయానికి వరి పంట మొత్తం నేలమట్ట మవడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఇ మండల వ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో పంట నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, మండల తహశీల్దార్, వ్యవసాయ అధికారులు పంట నష్టం సర్వే నిర్వహించి, నష్ట పోయిన రైతులకు పరిహారం అందించి అన్నదాతలను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.