30-09-2025 04:20:35 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): పాపన్నపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేకువ జామునే అమ్మవారికి నిత్యం వివిధ రూపాలలో అలంకరించి, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు తనివితీరా అమ్మవారిని దర్శించుకుని చల్లంగా చూడమ్మా తల్లి.. అంటూ వేడుకుంటున్నారు. పలువురు నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. సాయంకాల వేళ అమ్మవారికి హారతితో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. పది రోజులపాటు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొననుంది. అమ్మవారి మండపాల వద్ద మాలధారణ వేసి దీక్షలు చేపడుతున్నారు.