30-09-2025 04:30:04 PM
చిట్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డును భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయన్నారు. తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచిపోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు. కాగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులోనీ వివరాలను వివరించాలని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ జడ్పిటిసి గొర్రె సాగర్, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, పార్టీ యూత్ మండల అధ్యక్షుడు తౌటమ్ నవీన్, నాయకులు పుట్టపాక మహేందర్, కట్టెకోల్ల రాజు, జంబుల తిరుపతి, హరి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.