30-09-2025 04:48:57 PM
చెన్నై: సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాట సంఘటనలో 41 మంది మరణించగా, దాదాపు 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరువాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ తన మొదటి వీడియోను విడుదల చేశారు. ఈ సంఘటనపై కొనసాగుతున్న రాజకీయ వివాదాన్ని ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆ సందేశంలో, "నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. నా హృదయం బాధిస్తుంది. నా హృదయంలో బాధ మాత్రమే కాదు.. ప్రచారంలో నన్ను చూడటానికి ప్రజలు వచ్చారు. ప్రజలు నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ప్రజల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని నిర్ధారించుకోవడానికి, నేను రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజలకు సురక్షితమైన స్థలాన్ని ఎంచుకుని, పోలీసు శాఖను అభ్యర్థించాను. కానీ జరగకూడనిది జరిగింది." "నేను కూడా ఒక మనిషినే. ఇంతమంది దీని బారిన పడినప్పుడు, నేను ఆ వ్యక్తులను వదిలి ఎలా తిరిగి రాగలను? మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని నేను వెళ్ళలేదు" అని ఆయన అన్నారు.
విజయ్ తన పార్టీ నాయకుల పరిశీలనను కూడా ప్రస్తావించారు. తాను, తన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని విజయ్ చెప్పారు. "మేము ఏ తప్పు చేయలేదు. కానీ పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారులు వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. సీఎం సార్, మీకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే, నాకు ఏదైనా చేయండి. వారిని ముట్టుకోకండి. నేను ఇంట్లోనే ఉంటాను, లేదా నా ఆఫీసులో ఉంటాను” పేర్కొన్నారు. రాజకీయ కుట్రను సూచిస్తూ, "మేము ఐదు జిల్లాల్లో ప్రచారం చేశాం, అయితే కరూర్‌లో ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? ప్రజలకు నిజం తెలుసు, వారు ప్రతిదీ గమనిస్తున్నారని విజయ్ తెలిపారు.
"తమకు కేటాయించిన స్థానం నుండే మాట్లాడామని, వారు ప్రతిదీ చూస్తున్నారు. కరూర్ ప్రజలు సత్యాన్ని వ్యాప్తి చేయడం చూసినప్పుడు, సర్వశక్తిమంతుడు నిజం మాట్లాడటానికి భూమిపైకి దిగివచ్చినట్లు నాకు అనిపించింది. నిజం త్వరలోనే బయటపడుతుందనే నమ్మకం తనకు ఉంద వాపోయ్యారు. తొక్కిసలాటలో బాధిత కుటుంబాల బాధను నటుడు-రాజకీయ నాయకుడు అంగీకరించారు. "ఈ బాధ నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలందరిని కలుస్తానని విజయ్ తెలియజేశారు. తమ రాజకీయ ప్రయాణం మరింత బలంతో, నిర్భయంగా కొనసాగుతుందని, ఈ సమయంలో రాజకీయ నాయకులు, పార్టీ సభ్యులు, నాయకులు ఆయన తరపున మాట్లాడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసి ముగించారు.