calender_icon.png 15 September, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం

15-09-2025 04:53:21 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు..

రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): ఈనెల 21 నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma), భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) తెలిపారు. ఈ మేరకు వారు సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, మహిళల పూల పండుగ అని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజులు జరగనున్న నవరాత్రి ఉత్సవాలు, అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేసే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఘాట్ లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసే రహదారులు, వీధి లైటింగ్, త్రాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ లు, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వీధులలో, ప్రధాన కూడళ్ళలో వీధిలైట్లు వెలిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్ ఓ టు జి ఎం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.