27-11-2025 12:00:00 AM
కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జగదీశ్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్ల్సీ కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకి కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. “ఇది పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిలిం.
ఇప్పటివరకు చాలా డార్క్ కామెడీ సినిమాలు చూసుంటారు. కానీ, ఇది ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ ఫిలిం. ఇది ఒక్క రోజులో జరిగే కథ. చాలా అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. మా నిర్మాతలు ‘మహారాజా’ లాంటి అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్లు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదు” అన్నారు.
అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. “రంగస్థలం, పుష్ప తర్వాత అంత ఆనందంగా అనిపించిన సినిమా ఇది. మహానటి సావిత్రి పాత్రలో నవరసాలు పండించిన కీర్తి సురేశ్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సమంత, కీర్తి సురేశ్ గారు వీళ్లిద్దరే నాకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోయిన్స్. చాలా అద్భుతమైన కథ ఇది. ఇందులో కీర్తి యాక్షన్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ కుమార్ పాల్గొన్నారు.