03-01-2026 12:00:00 AM
అప్రమత్తతతోనే రోడ్డు భద్రత
అత్యవసరమైతేనే వేకువ జామున బయటికి వెళ్లాలి
బూర్గంపాడు ఎస్‌ఐ మేడ ప్రసాద్
బూర్గంపాడు, జనవరి2 (విజయక్రాంతి): శీతాకాలం ప్రారంభమైన నాటి నుంచి బూర్గంపాడు మండలంలో చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు కమ్ము కుంటోంది. వేకువ జాము సమయంలో రహదారులపై దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనం దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో చోటుచేసుకునే రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం పొగమంచే కారణమని పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. ఉదయం వేళల్లో అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. రహదారులపై సూచిక బోర్డులు స్పష్టంగా కనిపించకపోవడం, ఇండికేటర్లు వేయకుండా వాహనాలను నిలపడం, మద్యం మత్తులో నడపడం వంటి అంశాలు ప్రమాదాలను మరింత పెంచుతున్నాయి.
వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
పొగమంచు ఉన్న సమయంలో అతివేగంగా ప్రయాణించ కూడదు. హెడ్ లైట్లు ఆన్ చేసి మాత్రమే వాహనాలు నడపాలి. బ్రేక్ సిగ్నల్ లైట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో ముందుగా పరిశీలించుకోవాలి. అలాగే విండ్ షీల్ పై మంచు పేరుకుపోకుండా వైపర్లను వినియోగించాలి. వాహనాలకు రేడియం స్టిక్కర్లు అమర్చుకోవడం ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. వేకువజాము సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకుని, పొగ మంచు తగ్గిన తర్వాతే ప్రయాణించడం మరింత సురక్షితం చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
-బూర్గంపాడు ఎస్‌ఐ మేడ ప్రసాద్