11-02-2025 10:27:28 PM
మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో రోడ్డు ప్రమాదం..
మృతులంతా బంధువులు..
నాచారం నుంచి కుంభమేళాకు వెళ్లిన తొమ్మిది మంది బృందం..
మృతుల్లో ముసారాంబాగ్ నివాసి ఆనంద్ కుమార్ చారి..
చికిత్స పొందుతున్న న్యూమారుతి నగర్ నివాసి నవీన్ చారి..
ఎల్బీనగర్: పవిత్ర ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వెళ్లి, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నాచారం ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ముసారాంబాగ్ నివాసి ఆనంద్ కుమార్ చారి ఉండగా, న్యూ మారుతి నగర్ నివాసి నవీన్ చారి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. ముసారాంబాగ్ లో నివాసం ఉంటున్న గోల్కొండ ఆనంద్ కుమార్ చారి(47) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి(భార్య రాధ, ఇద్దరు కుమారులు ఆశ్రిత్, జశ్వంత్) ఉంటున్నాడు. నాచారంలో ఉంటున్న బంధువులు కుంభమేళాకు వెళ్తున్నారు. వారితో పాటు ఆనంద్ కుమార్ చారి, చైతన్యపురిలోని న్యూ మారుతి నగర్ కు చెందిన నవీన్ చారి కూడా బంధువులతో కలిసి మొత్తం తొమ్మిది మంది బృందం కుంభమేళాకు వెళ్లారు.
కాగా, శనివారం త్రివేణి సంగమంలో స్నానం చేశారు. తర్వాత నాచారం రావడానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆనంద్ కుమార్ చారి మృతితో ముసారాంబాగ్ లో విషాదం నెలకొంది. న్యూ మారుతి నగర్ కు చెందిన నవీన్ చారి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఆనంద్ కుమార్ చారి అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.