10-01-2026 09:07:29 PM
మునిపల్లి,(విజయక్రాంతి): జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా డెక్కన్ టోల్ ప్లాజా లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారి 65పై ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారుల కోసం విస్తృత స్థాయిలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రత్యేకంగా వివరించారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ఫ్లయర్లు, స్టిక్కర్లు పంపిణీ చేశారు. అలాగే రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా మూడు చక్రాల ఆటోలు, ట్రక్కుల వెనుక భాగాలకు రెట్రో-రిఫ్లెక్టివ్ టేప్‌ను అమర్చారు.
ఇది రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి నరేందర్ పాల్గొని రోడ్డు భద్రతకు సంబంధించిన విలువైన సూచనలు చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని డీటీపీఎల్ ప్రతినిధులు వెల్లడించారు.