calender_icon.png 16 May, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిర సౌర గిరిజల వికాసానికి రూ.12,600కోట్లు!

16-05-2025 01:44:35 AM

-ఐదేళ్లకు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

-18న అమ్రాబాద్‌లోని మాచారంలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

-గిరిజన రైతులకు చెందిన 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): యూపీఏ ప్రభుత్వం 2006లో తీసుకొచ్చిన ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ప్రకారంగా తెలంగాణలో హక్కుపత్రాలు పొందిన గిరిజన రైతు ల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి రా ష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రూపకల్పన చేసింది.

ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఏ శరత్ గురువారం జీవో విడుదల చేశారు. 2006 సంవత్సరంలో వచ్చిన ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ర్టంలో ఆర్‌వోఎఫ్‌ఆర్ హక్కు పత్రాలు పొంది ఉన్న 2.10లక్షల మంది రైతులకు ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ ద్వారా సాగునీరు అందించేందుకు రూపకల్పన చేసిన ఈ పథకానికి రూ.12,600 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని ఈనెల 18న అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభించడానికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచన చేసి ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ద్వారా భూ పట్టాలు ఇచ్చిన గిరిజన రైతులు పంటలు పండించుకోవడానికి ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

సౌరశక్తి విద్యుత్ సౌకర్యం అందించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఉద్యాన వన పంటలకు కావలసిన మొక్కలు ఇవ్వడం, ఆ పంటల నుంచి ఆదాయం వచ్చేంతవరకు అదనపు ఆదాయం కల్పించడానికి అంతర పంటలకు సౌకర్యం కల్పిస్తూ గిరిజనుల ఉన్నతి కోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొట్టమొదటి సారిగా దేశంలోని తెలంగాణ ప్రభుత్వం ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టంలో పేర్కొన్న విధంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రవేశపెట్టింది. 

-ఈ పథకం 2025- సంవత్సరం నుంచి 2029 వరకు (5) సంవత్సరాల కాలానికి 100 శాతం సబ్సిడీ ప్రాతిపదికన అందరికీ అందేవిధంగా అమలు చేయబడుతుంది.

-ఈ పథకం అటవీ శాఖ, ఇంధన శాఖ, ప్రజారోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, భూగర్భ జల శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఇతర లైన్ విభాగాలతో కలిపి అమలు చేయబడుతుంది.

-ఈ పథకం అమలు కోసం, జిల్లా స్థాయి లో కలెక్టర్ అమలు అధికారి. కలెక్టర్ ఇన్‌ఛార్జ్ మంత్రితో సంప్రదించి పథకం కింద అనుమతులను ఖరారు చేస్తారు.

-పథకం అమలును పర్యవేక్షించడానికి జిల్లాల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.