calender_icon.png 16 May, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల దోపిడీ ఆగదా?

16-05-2025 01:29:47 AM

ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజు నియంత్రణ చట్టం ఇంకెప్పుడో?

  1. 2025-26 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఇప్పటికే షురూ 
  2. పేరెంట్స్‌తో ఫీజులు కూడా 
  3. కట్టించుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు 
  4. ప్రైవేట్ ఫీజు దోపిడీపై మాటనిలబెట్టుకోని గత ప్రభుత్వం
  5. ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజు దోపిడీని నియంత్రిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
  6. అడ్మిషన్లు అయిపోతుంటే చట్టం చేసేదెప్పుడంటూ ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): 2025-26 విద్యాసంవత్సరానికి ఒకవైపు అడ్మిషన్లు చేపడుతూ ఫీజులను కూడా వసూలుచేస్తుంటే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం ఎప్పుడు చేస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం ఉత్తిమాటేనా? అంటూ నిలదీస్తున్నా రు. యేటా విద్యాసంవత్సరం ప్రారం భం ముందు ఏదో హడావుడి చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి.

కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాయి. సగానికిపైగా అడ్మిషన్లు కూడా ముగిశాయి. దీనికితోడూ విద్యార్థుల తల్లిదండ్రు ల నుంచి ఫీజులను కూడా కట్టించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఫీజుల కట్టడికి చట్టం చేస్తామంటోంది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజులు కూడా సమయంలేదు.

చట్టం చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉం టుంది. ఇప్పుడు ప్రత్యేకించి సమావేశాలు నడిపే పరిస్థితి కనబడట్లేదని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య సంఘాల నేతలు చెబుతున్నారు. దీంతో గతేడాదిలాగానే ఈ ఏడాది కూడా ఫీజుల నియంత్రణ చట్టం ఉత్తిమాటేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం తీసుకొస్తామని హామీనిచ్చింది.

కానీ అది అమలుకాలేదు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తామని ప్రకటించింది. పదిహేడు నెలలవుతున్నా ఇంతవరకూ ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. మరోవైపు నూతన విద్యాసంవత్సరానికి పాఠశాలల అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టి ఫీజులను కట్టించుకుంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వం చట్టం చేసినా ఫీజులను కట్టించుకుంటున్న స్కూళ్లు తిరిగి ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు చెల్లిస్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నియంత్రణ కరువు.. 

రాష్ర్టంలో 11,500వరకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ ఫీజులే కొన్ని స్కూళ్లు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సగటున ఒక్కో స్కూలు రూ.25 వేల నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు వసూ లు చేస్తున్నాయి.

స్కూళ్లకు రకరకాల పేర్లు పెట్టి, ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తున్నామని ఫీజులను దండుకుంటున్నారు. ఇటీవల విద్యారంగంలో సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గత సోమవారం సమావేశమై పలు అంశాలు చర్చించింది. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ర్టంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపింది.

విద్యాకమిషన్ సిఫార్సు చేసిన ముసాయిదా చట్టాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధులకు అందించారు. ప్రతీ ప్రైవేటు పాఠశాలలో 10మందితో కూడిన పేరెంట్స్, టీచర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు కూడా. ఇది ఇప్పట్లో ఆచరణలోకి సాధ్యమయ్యేలా కనిపించడంలేదని ప్రైవేట్ స్కూల్ యజమాన్య సంఘాల ప్రతినిధి ఒకరు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకవేళ చట్టం చేయాలంటే స్కూళ్ల ప్రారంభానికి ముందే చేయాలని ఆయన పేర్కొన్నారు. గత విద్యాసంవత్సరంతో పోల్చుకుంటే ఈ విద్యాసంవత్సరానికి 20 నుంచి 50 శాతం వరకు ఫీజులను పెంచేసి వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్యలు ఏ విద్యాసంవత్సరం నుంచి తీసుకుంటారో స్పష్టం చేయాలని పేరెంట్స్, విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.