16-05-2025 01:11:23 AM
యాదాద్రి భువనగిరి, మే 15 (విజయక్రాంతి): మిస్‌వరల్-2025 పోటీదారుల్లో కొందరు గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మరికొందరు భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించారు. 9 దేశాలకు చెందిన పోటీదారులు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శిం చారు. తెలుగువారి కట్టు, బొట్లకు ఏమాత్రం తీసుపోని విధంగా లంగా వోణీలు, చీరకట్లతో సంప్రదాయబద్ధంగా సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకున్నారు.
వారికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రొటోకాల్ అతిథిగృహంలో ప్రొజెక్టర్ ద్వారా ఆలయ విశిష్టతను ఆలయ వైస్ చైర్మన్ కిషన్‌రావు వివరించారు. అనంతరం సుందరీ మణులను ఆలయ సందర్శనకు తీసుకెళ్లారు. అఖండ దీపమండపం వద్ద సుందరీమణులు దీపారాధన చేశారు.
కోలాటం, సంప్రదాయ భజన, శాస్త్రీయ నృత్యాల మధ్య తూర్పు రాజగోపురం చేరుకొని ఆలయం ఆగ్నేయ మూలలో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తూర్పు మహాగోపురం వద్ద వేద పండితులు స్వాగతం పలుకగా త్రితల రాజగోపురం, ఆంజనేయస్వామి గుడి, ధ్వజస్తంభం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు.
ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి లక్షినరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదంతో పాటు లక్ష్మీనరసింహాస్వామి ప్రతిమ నమూనాతో సిద్ధం చేసిన జ్ఞాపిలను అందజేశారు. ఆలయ శిల్పకళకు అందగత్తెలు ముగ్ధులై, ఆలయ శిల్పకళా సంపద కనపడేలా ఫొటోలు దిగారు.
స్థానిక యువతులతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం అందరిని పలకరిస్తున్నట్టుగా చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందిస్తూ ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన బ్యాటరీ వాహనాల్లో ఆసీనులై ప్రొటోకాల్ వసతి గృహం వరకు చేరుకున్నారకు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్‌కు తిరుగు పయాణమయ్యారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పర్యాటక కేంద్రమైన భూధాన్ పోచంపల్లిలో అందాల బామలు సందడి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోడల్స్ చేనేత దుస్తులు ధరించి హంపి థియేటర్‌లో రాంప్ వాకింగ్ నిర్వహించి అందరి మన్ననలు పొందారు. సుందరీమణులు బతుకమ్మ, కోలాటాలు ఆడి సందడి చేశారు.
కళాత్మకమైన చేనేత వస్త్రాలను చూసి కొత్త అనుభూతికి లోనయ్యారు. బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ వస్త్రాలు అంటూ చేనేత కళా నైపుణ్యాన్ని కొనియాడారు. టూరిజం పార్క్ ఆర్చి వద్ద సుందరీమణులకు మహిళలకు బొట్టు పెట్టి కోలాటాలతో స్వాగతం పలికారు. టూరిజం పార్కులో మెహందీ లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత స్టాళ్లను సందర్శించారు. రాత్రి 8 గంటలకు కార్యక్రమం ముగియడంతో హైదరాబాద్‌కు వెళ్లారు.
వారికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పట్టు శాలువాలతో సన్మానించి, జ్ఞాపకాలను, నూలు వస్త్రాలతో తయారుచేసిన ప్రత్యేక బ్యాగులను అందజేశారు. కాగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిని, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఎకో టూరిజం పార్క్‌ను సుందరీమణులు సందర్శించనున్నారు.