calender_icon.png 16 May, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ నమస్తుభ్యం!

16-05-2025 01:43:47 AM

పుష్కర స్నానం.. పునీతం

  1. కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభించిన తొగుట పీఠాధిపతి మాధవానంద, మంత్రి శ్రీధర్‌బాబు
  2. పుణ్య స్నానమాచరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, పొన్నం 
  3. తొలిరోజు 80 వేల మంది భక్తుల పుణ్యస్నానం

మంథని, మే 15 (విజయక్రాంతి)/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని  కాళేశ్వరం త్రివేణి సంగమం లోని అంతర్వాహిని సరస్వతీ నదిలో గురువారం పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం తొగుట ఫీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దంపతులు స్నానమాచరించి, పుష్కరాలను ప్రారంభించారు.

సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్నారు. ఆయనకు మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్లు ఘన స్వాగతం పలికారు. ముందుగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ సిటీని ప్రారంభించారు. అనంతరం 17 అడుగుల ఏకశిలా సరస్వతీ మాతా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సరస్వతీ ఘాట్‌ను ప్రజలకు అంకితం చేశారు. తదుపరి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నదిలో స్నానమాచరించారు. సరస్వతీ నదికి చీర, సారె సమర్పించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల వంద స్టాల్స్‌ను మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కాశీ పండితులు నదీమ తల్లికి సమర్పించే నవ హారతులను సీఎం ఆసక్తిగా వీక్షించారు.

దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా తొలిరోజు ౮౦ వేల మంది భక్తుల పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తారు. 

భక్తులకు శ్రీపాద ట్రస్ట్ వైద్య సేవలు

సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ క్యాంపును ప్రారంభించారు. చక్రవర్తి హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.