calender_icon.png 12 January, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్‌తో రూ.15 కోట్ల మోసం

12-01-2026 02:28:58 AM

ఢిల్లీలో ఎన్నారై వృద్ధ దంపతులను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

వీడియోకాల్‌లో పోలీసు అధికారికే దమ్కీ 

గతంలో 48 ఏళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో డ్యూటీ చేసిన బాధితులు

న్యూఢిల్లీ, జనవరి 11: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ ఎన్నారై వృద్ధదంపతుల నుంచి దాదాపు రూ.15 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేశారు. అంతేగాక కేటుగాళ్లు ఢిల్లీలో జనవరి 10న ఆ దంపతులను ఆర్బీఐ రీఫండ్ పేరుతో ఒక పోలీస్ స్టేషన్‌కు పంపడంతో ఈ మోసం బయటపడింది. అక్కడ అధికారులు వారికి రూ.14.85 కోట్లు మోసం జరిగిందని నిర్ధారించారు. బాధితులు గతంలో ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. తమ జీవితకాల పొదుపును కోల్పోయామని ఆ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. డాక్టర్ ఓం తనేజా, అతని భార్య డాక్టర్ ఇందిరా(77) తనేజా యునైటెడ్ స్టేట్స్‌లో ఐక్యరాజ్యసమితిలో దాదాపు 48 సంవత్సరాలు పనిచేశారు. పదవీ విరమణ తర్వాత 2015లో భారతదేశానికి వారు తిరిగొచ్చి, ఢిల్లీలో ఉంటున్నారు. అప్పటి నుంచి, వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 24, 2025న వృద్ధదంపతులకు సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ వచ్చింది.

కాల్ చేసిన వారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) వంటి చట్టాలను ఉటంకిస్తూ, మనీ లాండరింగ్, జాతీయ భద్రతా ఉల్లంఘనలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అరెస్ట్ వారెంట్లు, తప్పుడు క్రిమినల్ కేసులతో వారిని బెదిరించారు. అప్పటి నుంచి 2026 జనవరి 10 ఉదయం వరకు, మోసగాళ్లు దంపతులను వీడియో కాల్స్ ద్వారా నిరంతరం పర్యవేక్షణలో ఉంచారు. ఈ 17 రోజుల్లో నేరగాళ్లు డాక్టర్ ఇందిరా తనేజాను ఎనిమిది వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని బలవంతం చేశారు. కొన్నిసార్లు రూ.2 కోట్లు, మరికొన్నిసార్లు రూ.2.10 కోట్లకు పైగా, ఇలా పలుదఫాలుగా మొత్తం రూ.14.85 కోట్లను ఆర్థిక నేరగాళ్లు తమ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.

జనవరి 10న కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని, పోలీసులకు సమాచారం అందించామని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఆమెను నమ్మించారు. ఆమె సైబర్‌నేరగాళ్లతో వీడియో కాల్ మాట్లాడుతూనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో కూడా ఆమె ఫోన్‌లో సబైర్‌నేరగాళ్లు అమర్యాదగా మాట్లాడారు. దీంతో డాక్టర్ ఇందిరా తనేజా మోసపోయానని తెలిసింది. తమ జీవితకాల పొదుపును పోగొట్టుకున్నామని ఆ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తును ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఓ) విభాగానికి బదిలీ చేశారు.