calender_icon.png 26 December, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.96 వేల కోట్ల స్పెక్ట్రం వేలం ప్రారంభం

26-06-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూన్ 25: కేంద్ర ప్రభుత్వం రూ.96,238 కోట్ల విలువైన 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రంకు మంగళవారం వేలం ప్రారంభించింది. తొలిరోజున మొత్తం ఐదు రౌండ్లలో టెలికాం కంపెనీలు (టెల్కోలు) రూ. 11,000 కోట్ల విలువైన బిడ్స్ సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం వేలం పునర్ ప్రారంభమవుతుందని టెలికాం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మొదటి రోజున 900 మెగాహెర్జ్, 1,800 మెగాహెర్జ్ బ్యాండ్స్‌కు బిడ్స్ వచ్చాయని, బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పాలుపంచుకున్నట్టు వెల్లడించారు. స్పెక్ట్రం వేలానికి రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్ల ముందస్తు డిపాజిట్ సమర్పించినట్టు సమాచారం.

ఈ కారణంగా మూడు టెలికాం కంపెనీల్లో గరిష్ఠంగా రేడియోవేవ్స్‌కు బిడ్ చేసే అవకాశం ఈ కంపెనీకి లభిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల చొప్పున ఎర్నస్ట్ మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. 900 మెగాహెర్జ్, 1,800 మెగాహెర్జ్, 2,100 మెగాహెర్జ్, 2,500 మెగాహెర్జ్  స్పెక్ట్రం బాండ్స్ పట్ల టెలికాం కంపెనీలు ఆసక్తి చూపించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత స్పెక్ట్రం వేలాన్ని 5 సర్వీసుల కోసం 2022 ఆగస్టులో  నిర్వహించారు. 3,300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ స్పెక్ట్రం బ్యాండ్స్‌కు కూడా ప్రస్తుతం వేలం జరుగుతున్నది. ఈ రెండు బ్యాండ్లు 5జీ సర్వీసులకు అనుకూలమైనవి. 

టెలికాం కంపెనీల ఆదాయంలో భారీ వృద్ధి 

దేశంలో టెలికాం కంపెనీల మొత్తం ఆదాయం 2019 నుంచి 87 శాతం పెరిగి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.2.39 లక్షల కోట్లకు (29 బిలియన్ డాలర్లు) చేరినట్టు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజా రిపోర్ట్‌లో తెలిపింది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌లు చందాదారుల్ని పెంచుకుంటున్నాయని, మరోవైపు వొడాఫోన్ ఐడియా కోల్పోతున్నదని పేర్కొంది. టాప్ టెలికాం కంపెనీలు రెండూ కలిపి దేశీయ టెలికాం ఆదాయంలో 78 శాతం చేజిక్కించుకుంటున్నాయని సీఎల్‌ఎస్‌ఏ వివరించింది.

వొడాఫోన్ ఐడియా ఇంకా 5జీ సర్వీసుల రోల్‌అవుట్ చేయాల్సి ఉన్నందున, జియో, ఎయిర్‌టెల్‌ల ఆదాయ వాటా 2026 ఆర్థిక సంవత్సరానికల్లా 83 శాతానికి పెరుగుతుందని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అంచనా వేసింది. రూ.37,700 కోట్ల ఆదాయంతో వొడాఫోన్ ఐడియాకు టెలికం మార్కెట్లో 15.7 శాతం వాటా ఉన్నదని, రూ. 88,700 కోట్లతో 37 శాతం వాటా భారతి ఎయిర్‌టెల్‌కు, రూ. 99,200 కోట్ల ఆదాయంతో జియోకు 41.4 శాతం వాటా ఉన్నదని వివరించింది.