calender_icon.png 27 January, 2026 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం భక్తులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు

27-01-2026 12:00:00 AM

ప్రజా రవాణాలో ఆర్టీసీ పాత్ర కీలకంగా ఉండాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం, జనవరి 26, (విజయక్రాంతి): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. స్థానిక బస్టాండులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బస్సులకు పచ్చజెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతర సమయంలో భక్తులకు ఎటువంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఎంతో సురక్షితమని, భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కార్మికులు, పేద ప్రజలు అధిక సంఖ్యలో ఈ జాతరకు తరలివెళ్తారని, వారి సౌకర్యార్థం బస్టాండ్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. జాతర ముగిసే వరకు నిరంతరం బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, మెకానిక్ ఫోర్ మెన్ వాకా వెంకటేశ్వర్లు, వై నాగేశ్వర్ రావు, కె మోహన్ రావు, విజయలక్ష్మి, ఎంప్లాయిస్ యూనియన్, సిపిఐ నాయకులు కందుల భాస్కర్, గెడ్డాడు నగేష్, యూసుఫ్, ధర్మరాజు, అన్నెం లక్ష్మీనారాయణ, మిర్యాల రాములు తదితరులు పాల్గొన్నారు.