28-11-2025 01:18:32 AM
ఇన్‌చార్జ్ కలెక్టర్ కరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల,నవంబర్ 27(విజయ క్రాంతి): రుద్రంగిగ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులో రుద్రంగి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం రుద్రంగి లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు.
హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ పుష్ప లత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులుపాల్గొన్నారు.