09-12-2025 12:00:00 AM
తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమరం ఊపం దుకుంది. అయిన వారి మధ్య జరిగే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో లక్షలు వెచ్చించి వేలం వేసి ఏకగ్రీవం అవడం, అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం, ఒకే పంచాయతీలో తల్లి బిడ్డలు పోటీ పడడం, పదవి కాలంలో ఎక్కువ ఆస్తులు సంపాదించినట్లైతే అవి పంచాయతీకే అని బాండ్ పేపర్ రాయడం, ఉన్నత ఉద్యోగాలకు రాజీనామా చేసి పంచాయతీ పోటీల్లో పాల్గొ నడం వంటి సంఘటనలు చూస్తున్నాము.
పదవి మీద వ్యామొహమో, రాజకీయ రంగంలో తొలి అడుగులు వేయాలనే ఆసక్తేమో కానీ పంచాయతీ ఎన్నికల పరంపర రసవత్తరంగా సాగుతుంది. కానీ అభ్యర్థులు పోటీపడడమే కాకుండా పంచాయ తీరాజ్ వ్యవస్థపై అవగాహన పెంచకుం టూ, తమ ప్రచారంలో భాగంగా ప్రజలకు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
సర్పంచ్ విధులు..
గ్రామ పంచాయతీ ప్రధమ పౌరుడిగా గ్రామంలో సూపరిపాలన అందించడం, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి కనీస అవసర సేవల నిర్వహణ, గ్రామసభకు అధ్యక్షత వహించి సభలను విజయవంతంగా నిర్వహించడం లాంటివి చేయాలిజ గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చడం, పన్నుల సేకరణ, నూతన ఆదాయవనరులను సృష్టించడం, గ్రామ అభివృద్ధి పనుల నిర్వహణ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉద్యోగ అవకాశాల కల్పన, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం బాధ్యతగా స్వీకరించాలి.
కేంద్ర, రా ష్ట్ర నిధులతో పాటు గ్రామంలో వచ్చే పన్నులు, ఇతరత్రా ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా వాటిని అభివృద్ధికి ఉపయోగించడం, ప్రజల సంక్షేమానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందించి గ్రా మంలో శాంతియుత వాతావరణ నెలకొల్పడం, గ్రామీణ వనరులను, నిధులను సమర్ధవంతంగా వాడుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరముంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం, గ్రామ రికార్డులను, లెక్కలను నిర్వహించడం లాంటివి చేయాలి. విద్య, వైద్య సదుపాయాలను పర్యవేక్షించడం, పథకాల అమల్లో, అభివృద్ధిలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయంగా వ్యవహరిస్తూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలి. గ్రామ పంచాయతీలకు పథకాల ద్వారా జమయిన నగదను, ఖర్చుల్లో పారదర్శకతను ప్రదర్శించడానికి కేంద్రం ప్రవే శపెట్టిన ఇ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్, మేరీ -పంచాయాత్ యాప్‌లపై గ్రామల్లో అవ గాహన కల్పించాలి.
పంచాయతీ నిధులు..
గ్రామ పంచాయతీలకు నిధులు ప్రధానంగా గ్రామ పంచాయితీ పన్నులు, ఇతర భవనాలు, మార్కెట్ యార్డు, సంతలు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుంది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధుల అద నం. 15వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2021-22 నుంచి 2025-26 వరకు ప్రతి సంవత్సరం రెండు విడుతలుగా పంచాయతీలకు నిధులను విడుదల చేస్తుంది.
వీటిలో 85 శాతం గ్రామాలకు, 10 శాతం మండల పంచాయతీలకు, 5 శాతం జిల్లా పంచాయతీలకు వాడుకుంటారు. అందులో జీతభత్యాలు గాక 11వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 29 అంశాల నిర్వహణకు అన్ టైడ్ ఫండ్ రూపంలో అందితే, అత్యవసర అవసరాలకు తాగునీటి సరఫరాకు, పారిశుధ్య నిర్వహణకు టైడ్ ఫండ్ రూపంలో విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం 2021--22 నుంచి 2025--26 కాలానికి రూ. 7,201 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది.
అందులో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,477కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకు అవసరాలకనుగుణంగా విడుదల చేస్తుంది. వీటితో పాటు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ జీవన మిషన్, మహాత్మా గాంధీ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్, నేషనల్ హెల్త్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన వంటి పథకాల పేరుతో కొన్ని నిధులు అందుతాయి.
ఉత్తమ గ్రామాలకు అవార్డులు..
భారత ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, జాతీయ పంచాయతీ అవార్డులను ఉత్తమ గ్రామాలకు ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తుంది. ఇది సూచించిన ముఖ్యమైన అంశాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే గ్రామపంచాయతీలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందులో పేదరిక నిర్మూలన, మెరుగైన జీవన విధానం, ఆరోగ్యకర గ్రామ పంచాయతీ, పిల్లల హక్కులు, విద్య, వైద్యం, మహిళల రక్షణ, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ లాంటి 9 అంశాలను ప్రామాణికంగా తీసుకొని మెరుగైన ప్రగతిని సాధించిన గ్రామ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులను అందజేస్తారు.
ప్రథమస్థానంలో నిలిచిన 3 గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌ను అందించడం జరుగుతుంది. అందిస్తుంది. అదీగాక అత్యుత్తమ పనితీరు కనబర్చిన మూడు గ్రామ పంచాయతీలకు, మూడు మండల పంచాయతీలకు, మూడు జిల్లా పంచాయతీలకు నానాజీ దేశముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్‌ను అందిస్తారు.
ఇవే కాక కొన్ని ప్రత్యేక విభాగలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వాడకం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ పునరుత్పాదక ఇంధన వనరులను వాడి గ్రామాన్ని కర్బన రహితంగా చేయడంలో కృషి చేసిన గ్రామాలకు.. క్లుమైట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్ అవార్డు, సొంత వనరులతో గ్రామ ఆదాయాన్ని పెంచే గ్రామ పంచాయతీలకు.. ఆత్మ నిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో సంస్థాగత సహకారం అందించే గ్రామ పంచాయతీలకు గ్రామ్ పంచాయత్ క్షమ నిర్మాణ్ సర్వోత్తమ్ సంతాన్ పురస్కార్ అవార్డులు.. ఏటా జాతీయ పంచాయతీ దినోత్సవం రోజున ప్రదానం చేయడం జరుగుతుంది.
పోరాడే నాయకత్వం..
మన తెలంగాణలో 2025 సంవత్సరానికి ప్రత్యేక అవార్డుల విభాగంలో రంగా రెడ్డి జిల్లాలోని యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీ అవార్డు గెలుచుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 3,211 జనాభా ఉన్న మాల్ గ్రామ పంచాయతీ ఆదాయంపై దృష్టి సారించింది. 2023--24 ఆర్థిక సంవత్సరంలో రూ. 67 లక్షలు, 2024--25లో రూ. 71 లక్షలు, పన్ను ఆదాయంతో సహా వివిధ వనరుల నుంచి 2025--26లో రూ. 82 లక్షలు అంచనా వేసింది.
ఎన్నికల్లో గెలుపు కోసం పోటీ పడినట్లుగానే గెలిచిన తరువాత తమ పంచాయతీలను ఉత్తమంగా తీర్చిదిద్ది దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో పోటీ పడాలి. ప్రజలు కూడా విధులు సక్రమంగా నిర్వర్తించే, నిధులను సమర్ధంగా ఉపయోగించే, గ్రామ సమస్యలపై పోరాడే నాయకత్వాన్ని ఎన్నుకో వాలనే ఆలోచన చేయాలి. అప్పుడే దేశానికి సంపూర్ణ గ్రామీణ స్వరాజ్యం దక్కు తుంది.
వ్యాసకర్త: బైరబోయిన వెంకటేశ్వర్లు