calender_icon.png 29 July, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సాగర్ గేట్లు ఎత్తివేత

29-07-2025 12:01:28 AM

  1. గేట్లను తెరవనున్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి 

పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయం

ప్రస్తుతం 585 అడుగులకు చేరిన నీటిమట్టం

18 ఏండ్ల తర్వాత జూలై నెలలో ప్రాజెక్టుకు వరద 

నాగార్జునసాగర్, జూలై 28: తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండటంతో మంగళవారం ఉదయం 10 గంటలకు క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. గేట్లను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తెరవనున్నారు.

18 ఏండ్ల తర్వాత జూలై నెలలో ప్రాజెక్టుకు వరద రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాగర్ క్రస్టుగేట్లను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో తెరుస్తారు. జూలైలో ఎత్తడం అరుదు. ఈసారి జూన్ 30 నుంచే ప్రాజెక్టుకు వరద మొదలైంది. 2007లో జూలైలో ప్రాజెక్టు గేట్లను ఎత్తగా 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జూలైలో నీటిని దిగువకు వదలనున్నారు. సాగర్‌లో నీటిమట్టం కృష్ణమ్మ పరవళ్లతో పూర్తి స్థాయికి చేరువలో ఉంది.

శ్రీశైలం నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రం వరకు 585 అడుగులు (295.8675)  టీఎంసీల నీరు చేరుకుంది. నీటిమట్టం 585 అడుగులకు చేరిన నేపథ్యంలో సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలాలని ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదులుతారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో బుధవారం ఉదయానికి పూర్తి స్థాయిలో నిండనుంది.

మంగళవారం ఉదయం 10 గంటలకు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు 2లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నాగార్జున సాగర్ దిగువన ఉన్న కృష్ణా నది పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను, పులిచింతల, పరిధిలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా నదిలో చేపల వేటకు వెళ్లరాదని జాలర్లకు సూచించారు. 

కాగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మూడు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంలో 1,69,044 క్యూసెక్కులు చేరుతోంది.

శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,67,195 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. మూడు స్పిల్ వే గేట్ల ద్వారా 80,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.04 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 1,47,195 క్యూసెక్కుల వరద ప్రవాహం సాగర్‌కు కొనసాగుతోంది. 

వరద కాల్వకు సాగునీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీశైలం లో లెవెల్ కెనాల్‌కు సోమవారం ఇరిగేషన్ అధికారులు సాగునీటిని విడుదల చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పూల్య తండా వద్ద గల పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ, డీఈ వేణు వరద కాలువలోకి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరదరావడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో 575 అడుగులు దాటిన తర్వాత వరద కాలువకు గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేసేందుకు వీలు కలిగింది. ఈ క్రమంలో జిల్లాలోని పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం తదితర మండలాల్లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. దీంతో పాటుగా జిల్లాలోని 80 చెరువులు, కుంటలను వరదకల ద్వారా నీటిని నింపనున్నారు.

మెయిన్ కెనాల్ పరిధిలోని మొత్తం 42 డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, ప్రస్తుతం 30 డిస్టిబూట్ల వరకు సాగునీటిని విడుదల చేశారు. మరో వారం రోజుల తర్వాత మిగిలిన 12 డిస్ట్రిబ్యూటర్లకు సాగునీటిని అందించనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోసం నేటి నుంచి 120 రోజుల పాటు వరద కాల్వకు సాగునీటిని విడుదల చేయనున్నారు.