20-09-2025 02:27:16 PM
2014 జూన్ 2 వరకు ఉన్న సాదాభైనమాలకే అవకాశం
2020 అక్టోబర్ నుండి నవంబర్ 10 వరకు ఆన్ లైన్ లో ఉండాలి
వలిగొండ మండలంలో 1,383 దరఖాస్తులు
వలిగొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులకు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న భూ సమస్యలు సులభంగా పరిష్కారానికై నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా ఏండ్ల క్రితం తెల్ల కాగితాలపై సాదాబైనామా కొనుగోలు చేసిన భూములకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో మోక్షం కల్పించి క్రమబద్ధీకరించనుంది. తెల్ల కాగితాలపై భూమి కొనుగోలు చేసి రాసుకున్న వారికి గత ప్రభుత్వం క్రమబద్ధీకరణకు 2016, 2020లో రెండు పర్యాయాలు దరఖాస్తులు స్వీకరించింది. కానీ పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేక దరఖాస్తులు అలానే ఉండిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేసేందుకు రైతుల ప్రయోజనాల కోసం అడుగు ముందుకు వేసింది.
అయితే సాదాబైనామా క్రమబద్ధీకరణ జరగాలంటే కొనుగోలు చేసిన భూములలో కొనుగోలుదారు కబ్జా కలిగి ఉండాలి. అలాగే 2014 జూన్ రెండు వరకు తెల్ల కాగితంపై కొనుగోలు చేసి ఉండాలి. అదేవిధంగా 2020 అక్టోబర్ నుండి నవంబర్ 10 వరకు ఆన్లైన్లో నమోదయి ఉండాల్సి ఉంటుంది. అటువంటి సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు జారీ చేసి క్రమబద్ధీకరించనున్నారు. ఇటువంటి సాదాబైనామా దరఖాస్తులు వలిగొండ మండలంలో 1,383 దరఖాస్తులు ఉండగా వాటికి త్వరలోనే మోక్షం లభించనుంది.