13-09-2025 02:13:59 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : యూరియా కోసం రైతులు ఆందో ళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా కల్పించారు. రెండు రోజులుగా రాష్ట్రానికి 23వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మరో నాలుగు రోజుల్లో 27.64 వేల మెట్రిక్ టన్నులు రానున్నదని తెలిపారు. యూరియా సరఫరాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, కమిషనర్ రఘునందన్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి పునరుద్ధ్దరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా నిరంతరాయంగా కొనసా గించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుంచి 11 రేకులు రవాణాలో ఉన్నాయని, త్వరలో మిర్యాలగూడ, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, తిమ్మాపూర్, వరంగల్, సనత్‌నగర్‌కు చేరుకుంటాయని చెప్పారు. అక్కడి నుంచి అవసరమైన జిల్లాలకు తరలించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఎరువుల పంపిణీకి అంతరాయం లేకుండా రైతు వేదికల్లోనూ సేల్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.
ఇక్రిశాట్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం
తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఇక్రిశాట్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమని మంత్రి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రితో ఇక్రిశాట్ అధికారు లు భేటీ అయ్యారు. చిక్కుళ్లు, తృణధాన్యాలు, ఇతర పంటలను మెరుగైన పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని మంత్రికి ఇక్రిశాట్ అధికారులు వివరించారు. తెలంగాణలో వ్యవ సాయ రంగం అభివృద్ధికి సాంకేతిక సహకారాన్ని అందిస్తామని ఇక్రిశాట్ అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ కార్యాలయానికి మంత్రి తుమ్మలను ఆహ్వానించారు.
మంత్రిని కలిసిన ఆఫ్రికన్ బృందం
తెలంగాణలో వ్యవసాయ రంగం, విత్తనోత్పత్తి రంగంలో సాధించించిన ప్రగతిని తెలుసుకోవడానికి వచ్చిన ఆఫ్రికన్ ప్రతినిధి బృందం శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విత్తనోత్పత్తి రంగంలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో సాధించిన విజయాలను మంత్రి తుమ్మల ఆఫ్రికన్ ప్రతినిధి బృందానికి వివరించారు.