08-09-2025 01:12:57 AM
బషీర్‌బాగ్ మార్గంలో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం
కుటుంబానికి అండగా ఉంటాం: మేయర్, కమిషనర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక చాలా సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డును దాటేందుకు యత్నించింది.
అదే సమయంలో బషీర్‌బాగ్ నుంచి వస్తున్న టస్కర్ వాహనం రేణుకను ఢీకొట్టి వెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడే ఉన్న మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైపాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు రేణు క మృతి చెందిన విషయం తెలియగానే వెం టనే జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ హుటాహుటిన హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రేణుక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్, కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిషనర్ ఆదేశించారు.