10-11-2025 08:53:46 PM
నవంబర్ 11న ప్రారంభమై 18తో ముగుస్తాయి
ఆలయంలో ఏడు రోజుల పాటు భక్తి ప్రవచన, కీర్తన కార్యక్రమాలు, అన్నదానం
చివరి రోజు కాగడ హారతి, పల్లకి ఊరేగింపు, మహా అన్న ప్రసాద వితరణతో ముగింపు
కుభీర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మరో పండరీపురంగా వెలుగొందిన శ్రీ విఠలేశ్వర ఆలయంలో మంగళవారం నుండి తాళ సప్తాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ, గ్రామంలోని మున్నూరు కాపు యాదవ, ఆర్యవైశ్య సంఘాలతో పాటు వివిధ కుల సంఘాల సహకారంతో ఏడు రోజులపాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో అనాదిగా ఈ వేడుకలు కొనసాగుతూ వస్తున్నాయి. ఏడు రోజుల పాటు ఆలయంలో నిత్య పూజలతో పాటు భజనలు, కీర్తనలు, హరి పాట్, తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ తెలిపింది.
చివరి రోజైన 18వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో కాకడ హారతి, స్వామివారికి అభిషేకం పుష్పార్చన నూతన పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపు, కాల కీర్తన కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే జాతరకు పరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నిర్మల్ జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ నిర్వహించే మహా అన్నప్రసాద కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తులు కొంగు బంగారంగా కొలిచే పాండురంగడి చెంత ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. గత పది రోజులుగా ఆలయాన్ని కమిటీ ముస్తాబు చేసింది.