11-07-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూలై 10 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సరస్వతి నిలయంగా పేరు గడిస్తోంది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక అడ్మిషన్లతో మానుకోట బాలికల కళాశాల ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2024 - 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణత సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
కళాశాలలో ఎంపీసీ, బైపిసి, సిఈసి, హెచ్‌ఈసి గ్రూపులతోపాటు ఒకేషనల్ విద్యలో వో ఏ, ఎం పి హెచ్ డబ్ల్యు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో 2025 - 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇప్పటికే 290 విద్యార్థులు అడ్మిషన్ పొందడం విశేషం. అలాగే ద్వితీయ సంవత్సరంలో 245 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులు మినరల్ వాటర్ ప్లాంట్, వైట్ బోర్డులు, వాష్ రూమ్ లు, పెయింటింగ్, సభా వేదిక షెడ్ ఏర్పాటుకు ప్రిన్సిపల్ పొక్కుల సదానందం తన సొంత డబ్బు సుమారు రెండు లక్షల రూపాయలు వెచ్చించడంతోపాటు, దాతల సహకారంతో లక్ష రూపాయలు ఖర్చుచేసి తరగతి గదుల్లో ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలను కల్పించి , పూల మొక్కలు నాటి ఉద్యానవనంగా కళాశాలను సుందరంగా తీర్చిదిద్దారు.
విద్యార్థినిలకు మెరుగైన విద్యా బోధన చేయడానికి 15 మంది అధ్యాపకులతో పాటు మానసిక ఒత్తిడి తొలగించడానికి, ఇతర క్రీడా, సాంస్కృతిక అంశాల్లో అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా అవగాహన సదస్సులు, వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న అనాధ, నిరుపేదపేద కుటుంబాలకు చెందిన 30 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడంతోపాటు దాతల సహకారంతో ఆ దుస్తులు కూడా సమకూర్చారు.
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనితో గడచిన రెండేళ్లలో మహబూబాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఉత్తీర్ణత, అడ్మిషన్ల ప్రక్రియలో జిల్లాలో ‘టాప్’ పొజిషన్ కు చేరింది.
విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన
మహబూ బాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. చదువులో వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి, ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. తర తమ బేధాలు లేకుండా విద్యార్థినులందరికీ ఏకరూప దుస్తుల విధానం అమలు చేస్తున్నాం.
దాతల సహకారంతో విద్యార్థినులకు కళాశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. బాలికలకు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన, సౌకర్యాల కల్పన వల్ల అడ్మిషన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం చేసాం. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలపై నమ్మకం కలిగించాం. ఇదే స్ఫూర్తిని ముందు ముందు కొనసాగిస్తాం.
ప్రిన్సిపల్, సదానందం