12-07-2025 11:31:52 PM
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రణీత్ ఆంటీలియా గేటెడ్ కమ్యూనిటీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ పరిధి ప్రణీత్ ఆంటీలియా కాలనీ వాసులు నిర్వహించిన విలేకరుల సమావేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. మల్లంపేట్ ఆంటీలియా కాంపౌండ్ వెనుక భాగంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 170 ఉప సర్వే నంబర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి అక్రమ దందాల కొరకు కుట్ర పొందుతున్నారని, ఆ యొక్క సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం సర్వే నిర్వహించి ఈ భూమిని మల్లంపేట్ ప్రజల కోసం కమ్యూనిటీ హాల్ /ఫంక్షన్ హాల్ వంటి ప్రజా ప్రయోజనార్ధ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఎగ్జిట్ 4A నుండి బాచుపల్లి, ఎగ్జిట్ 4A నుండి రెడ్డి ల్యాబ్స్ గుండా దర్గా వరకు 100 అడుగుల రోడ్లను పూర్తి చేస్తామని తెలియజేశారు.
ఈ రహదారి అభివృద్ధి కొరకు నిధుల విడుదల కోసం శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి చర్యలు తీసుకుంటానన్నారు. చిన్న కాలనీలను ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు హెచ్చరించి, దీర్ఘకాలికంగా ఉపయోగపడే స్థిరమైన పరిష్కారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎటువంటి రియల్ ఎస్టేట్ దందాలకి భయపడాల్సిన అవసరం లేదని కాలనీ వాసులకి హామీ ఇస్తూ హైడ్రా అధికారులతో, నిజాంపేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రణీత్ ఆంటీలియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శ్రీరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.