3 July, 2026 | 1:34 AM

బడి డ్రెస్సులు రెడీ

12-06-2024 01:40 AM

స్కూళ్ల ప్రారంభం రోజునే పంపిణీకి సిద్ధం

మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ బాధ్యతలు

గడువులోగా పూర్తయ్యేలా చొరవ చూపిన మంత్రి సీతక్క

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి)ః ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లు సిద్ధం అయ్యాయి. యూనిఫాం స్టిచ్చింగ్ పనులను దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించగా అందుకు సంబంధించిన పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో పాఠశాలల ప్రారంభం రోజునే యనిఫామ్‌లు విద్యార్థులకు అందచేయనున్నారు. గతంలో స్టిచ్చింగ్ పనులను పరిమిత సంఖ్యలో టైలర్లకు అప్పగించడం వల్ల యూనిఫామ్‌ల పంపిణీ జాప్యం జరిగింది. కొన్ని సందర్భాల్లో పాఠశాల ప్రారంభమై మూడు, నాలుగు నెలలు గడచినా  అందేవి కావు.

ఈ సమస్యను గుర్తించిన  ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలో మొదటిసారిగా మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులు అప్పగించింది. రూ.50 ఉన్న కుట్టు కూలీని రూ.75కు ప్రభుత్వం పెంచింది. మహిళా సంఘాలు సవాలుగా తీసుకుని సకాలంలో పూర్తి చేయగలిగాయి. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘం సభ్యులు ఉండగా వీరిలో 18వేలు విలేజ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వారికి 15,30,603 (ఒక జత) యూనిఫామ్‌లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా ఇప్పటివరకు 90 శాతం పూర్తయ్యాయి.  దానికి సుమారు రూ.50 కోట్లు స్టిచ్చింగ్ ఆదాయం, ప్రతి సంవత్సరం సమకూరుతుంది.

అయితే మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించినప్పటి నుంచి  వాటిని సకాలంలో పూర్తయ్యే విధంగా పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు అధికారులను, మహిళా సంఘాలను సమన్వయ పరుస్తూ గడవులోగా పాఠశాలలకు యూనిఫామ్‌లు చేరేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మొదటి రోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అందచేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లయ్యింది. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ పనులను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, సకాలంలో పనులు పూర్తి చేసే వ్యవహరించిన మహిళా సంఘాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పిఆర్‌ఆర్‌ఇ సీఈవో సర్ప్, కలెక్టర్స్, సర్ప్ అధికారులను, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో ఇతర అధికారులను మంత్రి సీతక్క అభినందించారు.