3 July, 2026 | 12:42 AM

పనికెక్కిన పల్లెలు!

12-06-2024 01:42 AM

మొదలైన ఖరీఫ్ పనులు

మూడు రోజులుగా వర్షాలు

పొలం పనుల్లో మునిగిన రైతులు

కామారెడ్డి పల్లెల్లో సాగు సందడి

కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి) : సకాలంలో వర్షాలు రావడంతో జిల్లాలో రైతులు ఖరీఫ్ పంట సాగుకు రైతులు సిద్ధమైయ్యారు. గత మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో కురుస్తున్న వర్షాలకు రైతులు తమ వ్యవసాయ పనుల్లో దుక్కులు దున్నుతూ, పంటలు వేయడానికి నిమగ్నమయ్యారు.  కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాల్లో వ్యవసాయ పనులు షురూ చేశారు. గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు, రైతులను ఎంతో ఊరట కలిగించాయి.

వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయని వాతావరణం శాఖాధికారులు పేర్కొనడంతో జిల్లా రైతులు దుక్కులు దున్ని, వరినారు మళ్ళను సిద్ధం చేశారు. మెట్ట ప్రాంతాల్లో దుక్కులు దున్ని, పత్తి, సోయా, మొక్కజొన్న విత్తనాలను నాటుతున్నారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కెనాల్ పారకం పరిదిలోని రైతులు వరి వేసేందుకు వరి నారుమళ్ళను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొంత మంది రైతులు వరినారు వేయడంతో నాటు వేసేందుకు ఏపుగా పెరగడంతో రైతులు వరినాట్లను వేస్తున్నారు.

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కువగా మెట్ట పంటలు ఉండడంతో వర్షంపై ఆధారపడిన పంటలనే రైతులు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 5,14,686 ఎకరాల్లో ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి, అంచనాలను రూపొందించారు. 2023 ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 4,73,087 ఎకరాల్లో వివిద రకాల పంటలు వేశారు. ఆ సీజన్‌లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో చివరలో వర్ణుడు ముఖం చాటేయడం వంటి కారణాల వల్ల పంటలు తక్కువగా సాగు చేశారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో జిల్లాకు రావడంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో బిజిగా గడుపుతున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు తెల్లవారుజామునుంచే పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో కెనాల్ ప్రాంతాల్లో వరినాట్లు వేసేందుకు రైతులు వరి నారుమడులను సిద్ధం చేసి, వరి నాట్లు నాటుతున్నారు. జుక్కల్, చిన్నకొడప్‌గల్, పెద్దకొడప్‌గల్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో మెట్ట భూములు ఉండడంతో ఎక్కువ మంది రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు పత్తి విత్తనాలను నాటుతున్నారు.

బాన్సువాడ, నిజాంసాగర్, మహమ్మద్‌నగర్, భీర్కూర్ మండలాల్లో వరి నాట్లు నాటేందుకు వరినారుమళ్లను సిద్ధం చేసి, తూకాలు ఇప్పటికే పోయడంతో వరి నాటేందుకు ఏపుగా పెరిగిన తుకాలను రైతులు వరిపొలంలో వరి నాటుతూ రైతులు బిజిగా ఉన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట్, సదాశివనగర్, గాంధారి, లింగంపేట్ మండలాల్లో ఎక్కువగా మెట్ట పంటలు ఉండడంతో మెట్ట భూములను ఎద్దులు, ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్నుతూ వెంటనే భూమి పంట వేయడానికి అనుకూలంగా ఉండడంతో పత్తి, సోయా, మొక్కజొన్న పంటల విత్తనాలను నాటుతూ రైతులు బిజిగా ఉన్నారు. ఎక్కడ చూసినా పంటల సాగుకే రైతులు పంట పొలాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు గడుపుతున్నారు. 

ఖరీఫ్ సాగుకు ప్రణాళిక

కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 5,14,686 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. 3,13,965 ఎకరాల్లో వరి సాగు, సోయా 85,444, మొక్కజొన్న 57,315, పత్తి 28,730, కంది 13,961, మినుము 5,263, పెసర 4,997, చెరుకు 21,271, ఇతర పంటలు 3,740 ఎకరాల్లో సాగు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

కామారెడ్డి జిల్లాలోని రైతులు ఖరీఫ్ సాగులో స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదిం చాలి. గత ఖరీఫ్ సీజన్ కంటే ఈ ఖరీఫ్ సీజన్ పంటలు ఎక్కువగా సాగు అవుతాయి అని భావిస్తున్నాం.

- భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి

సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి

వర్షాలు ఈ ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో రావడంతో పంటలు వేసేందుకు సిద్ధమయ్యాం. దుక్కులు దున్ని, వరినాట్లు వేసేందుకు పంట పొలాలను సిద్ధం చేశాం. మహిళా రైతులతో వరి నాట్లు వేస్తున్నాం. సకాలంలో నాట్లు వేస్తే పంటలు అధిక దిగుబడులు ఇస్తాయి. తమ గ్రామంలో వరినారు మడులు సిద్ధం చేస్తున్నాం.

- మంగ దుర్గయ్య, రైతు, గోర్గల్ గ్రామం,  కామారెడ్డి జిల్లా