calender_icon.png 24 September, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఐఎస్ పై పట్టు ప్రగతికి మెట్టు

24-09-2025 05:09:43 PM

సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు ఉద్బోధ

పటాన్ చెరు: భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)పై పట్టు సివిల్ ఇంజనీర్లుగా రాణించడానికి, తక్కువ వ్యవధిలో సులువుగా ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఉపకరిస్తుందని హైదరాబాదు INCOISలోని ఓషన్ డేటా మేనేజ్ మెంట్ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ‘రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ తో సివిల్ ఇంజనీరింగును సాధికారపరచడం’ అనే అంశంపై బుధవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు.

భౌగోళిక సమాచార శాస్త్రం (Geoinformatics) యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ రావు వివరిస్తూ, రిమోట్ సెన్సింగ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), సర్వేయింగ్ పద్ధతుల ద్వారా భౌగోళిక (జియోస్పేషియల్) సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, వివరించడంలో దాని పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. తరచుగా ప్రాదేశిక డేటాబేస్ గా పిలువబడే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (జీఎస్ఐ), సహజ వనరుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, పర్యావరణ స్థిరత్వంలో సవాళ్లను మనం అర్థం చేసుకుని, పరిష్కరించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని ఆయన చెప్పారు.

ఉపగ్రహ కక్ష్యలు, ప్రాదేశిక స్పష్టత, భూమి ఉపరితలాన్ని పర్యవేక్షించడంలో వాటి వినియోగంతో సహా రిమోట్ సెన్సింగ్ ప్రాథమిక సూత్రాలను డాక్టర్ రావు వివరించారు. పట్టణ వరద నివారణ, విపత్తు నివారణ, అత్యవసర ప్రతిస్పందన ప్రణాళిక కోసం 1డీ, 2డీ హైడ్రోడైనమిక్ నమూనాను అనుసంధానించే జీఐఎస్, పొంగిపొర్లే వరద (MIKE Flood) వంటి అధునాతన వరద నమూనాల వాడకం గురించి కూడా ఆయన విశదీకరించారు. వర్షపాత అంచనా, మేఘ మథనం (క్లౌడ్ సీడింగ్) విశ్లేషణను ఎలా నిర్వహిస్తుందో తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ సిబ్బంది చేసే అవినీతిని అరికట్టడానికి పారదర్శక డేటా వినియోగాన్ని జీఐఎస్ ఎలా నిర్ధారిస్తుందో డాక్టర్ రావు వివరించారు.

హైదరాబాదులోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఉపగ్రహ డేటా 1975 నుంచి నేటి వరకు అందుబాటులో ఉందని, దానిని ఉచితంగానే వినియోగించుకోవచ్చని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరచడానికి ఐవోటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిల్ లెర్నింగ్ ద్వారా డిజిటల్ ట్విన్ టెక్నాలజీ, భౌతిక వ్యవస్థల యొక్క రియల్-టైమ్ వర్చువల్ ప్రతిరూపాలు భవిష్యత్తులో సివిల్ ఇంజనీర్ల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. తొలుత, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ చేపూరి అఖిలేష్ అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేయగా, సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషాతో కలిసి సత్కరించారు.