24-09-2025 07:45:44 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ కానుకగా మహిళలకు ఇస్తున్న చీరలను, తెలంగాణలోని మహిళలందరికీ ఇచ్చి మహిళలందరిని గౌరవించాలని ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూడెం లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రోజున జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) కరీంనగర్ నగర కార్యవర్గ సమావేశం నగర అధ్యక్షురాలు కొట్టి అంజలి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గూడెం లక్ష్మి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కేవలం సమబావన సంఘాల సభ్యులకు (గ్రూపు మహిళలకు) మాత్రమే చీరలను పంపిణీ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందని, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని కొంతమంది మహిళలకు ఇచ్చి, కొంతమంది మహిళలకు ఇవ్వకుండా ఉండటం ఒక రకంగా వారిని అవమానించటమేనని, రాష్ట్రంలోని మహిళలందరికీ దసరా కానుకగా చీరెలను పంపిణీ చేయాలని ఆమె కోరారు.