13-12-2025 06:17:18 PM
ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయాలి
రెండవ విడత ఎన్నికలకు 700 మంది పోలీసు అధికారులు సిబ్బంది తో భారీ బందోబస్తు ఏర్పాటు
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలకాల మొహరంపు
నారాయణపేట (విజయక్రాంతి): రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇన్సిడెంట్ ఫ్రీగా ఎన్నికల నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నారాయణపేట, దామరిగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బంది అందరికి నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రతాపరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 700 మంది పోలీసు అధికారులు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, నాలుగు మండలాలలో మొత్తం 28 రూట్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరించేందుకు 05 స్ట్రైకింగ్ ఫోర్స్, 05 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వీరు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసులతో మాట్లాడుతూ ఉండాలని సూచించారు.
అదేవిధంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిదిలో ఉన్న మొబైల్ రూట్ లను, వాటి పరిధిలోకి వచ్చే గ్రామాలు, సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను, ఆక్కడ నియమించిన పోలీస్ అధికారుల వివరాలను పరిశీలించి ఆయా రూట్ లలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజు, పోలింగ్ కేంద్రాల దగ్గరా పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు అధికారులు సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు. ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 (బి.యన్.ఎస్.ఎస్)యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల లోపల ఎవ్వరినీ రానివ్వకూడదని ఓటు హక్కు వినియోగించుకోనే వారు పోలింగ్ కేంద్రాలకు ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్,ఇతర హాని కలిగించే వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తె వెంటనే సంబంధితపై అధికారులు సమాచారం అందించాలని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపు,ర్యాలీలకు అనుమతి లేదని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, రఘునాథ్, సీఐలు ఎస్ఐలు, పోలీసు సిబంది తదితరులు పాల్గొన్నారు.