10-01-2026 01:32:02 AM
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు వచ్చే మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే ప్రక్రియకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టారు. వరుసగా జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాతో పాటు శుక్రవారం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యనేతలతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమై వచ్చే పురపోరులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా 4000 పైచిలుకు గ్రామ పంచాయతీలు బీఆర్‌ఎస్ గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా గులాబీజెండాకు పూర్వ వైభవం తెచ్చేందుకు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. ఇప్పటికే ప్రతి వార్డు డివిజన్ వారీగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు నేతలు కేటీఆర్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాల పైన కేటీఆర్, నేతలకు దిశానిర్దేశం చేశారు.