calender_icon.png 21 May, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమించాలని కత్తిపోట్లు

21-05-2025 04:42:19 PM

నేరస్థుడికి 9 ఏండ్ల జైలు..

నల్లగొండ కోర్టు సంచలన తీర్పు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రేమపేరుతో ఓ యువతిపై కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన నిందితుడికి 9 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ కోర్టు(Nalgonda Court) బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డు అబ్బాసియా కాలనీకి చెందిన మీసాల రోహిత్, పానగల్ కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతుండగా, ఆ యువతి నిరాకరిస్తూ వస్తోంది. ఆగస్టు 9, 2022న నల్లగొండ జిల్లా కేంద్రం మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఫారెస్టు పార్కుకు, ఆ యువతి, ఆమె స్నేహితురాలు కలిసి వెళ్లారు. అదే సమయంలో రోహిత్ వచ్చి ప్రేమించాలని వెంటపడగా, ఆమె నిరాకరించింది. దీంతో కొపోద్రిక్తుడైన రోహిత్ యువతిని కత్తితో పొడిచాడు.

తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో, వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, ఆమె తండ్రి అదే రోజు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ గోపి కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు వాయిదాలపై నడుస్తూ మే 21న బుధవారం ఫైనల్ కు వచ్చింది. దీంతో న్యామూర్తి కేసు పూర్వాపరాలను, సాక్షాదారాలను పరిశీలించి, రోహిత్ ను నేరస్థుడిగా పరిగణిస్తూ ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం 9 ఏండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి డి.దుర్గాప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. కాగా, అప్పటి వన్ టౌన్ సీఐ రౌతు గోపి, అడిషనల్ పీపీ జి.జవహర్ లాల్, ఎన్డీపీవో నర్సింహారెడ్డి, ప్రస్తుత ఎన్డీపీవో కొలను శివరాం రెడ్డి, ప్రస్తుత వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్, సీడీవో వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.