21-05-2025 08:48:12 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.