21-05-2025 09:41:27 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఖానాపూర్ మార్కెట్ యార్డు(Khanapur Market Yard)లో వరి రైతులు తల్లడిల్లిపోయారు. ఆరుగాలం కస్టించి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలించి అమ్ముకుందామంటే అకాల వర్షం వరి రైతును భారీగా నష్టపరిచింది. మార్కెట్ కమిటీ పాలకవర్గం సిబ్బంది ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించినప్పటికీ, తూకంలో ఆలస్యం అవ్వడంతో అనేకమంది రైతులు ఇంకా తమ పంటని అమ్ముకునేందకు కల్లాల్లోనే ఉంచారు.
ఈ నేపథ్యంలో బుధవారం కురిసిన వర్షానికి పండించిన పంట కాస్త వర్షార్పణం అయిపోయింది. దీంతో రైతు కన్నీటి పర్యంతమై తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోరున విలపిస్తున్నారు. కాగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్ మార్కెట్ యార్డులో పరిస్థితి సమీక్షించి, రైతులకు భరోసా ఇచ్చారు. అక్కడి పరిస్థితులను సమీక్షించి అకాల వర్షం మిగిల్చిన కడగండ్ల పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు.