15-09-2025 12:30:27 AM
జనగామ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా ఎస్ ఎస్ ఎన్ గార్డెన్ లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ధరావత్ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆముగోత్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సేన ఉద్యమం కేవలం సాంస్కృతిక పరిరక్షణకే పరిమితం కాదు జాతిని రాజ్యాధికార దిశగా తీసుకువెళ్లడం, సామాజిక,రాజకీయ,ఆర్థిక రంగాల్లో పునర్నిర్మాణం చేయడం మా ప్రధాన ధ్యేయం అన్నారు.
ముఖ్య అతిథి, జాతీయ అధ్యక్షుడు చినబాబు నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సేనను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తాం. ప్రతి రాష్ట్రంలో సేన బలమైన నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని పేర్కొన్నారు. హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జోగురాం నాయక్ మాట్లాడుతూ బంజారా, సుగాలి, లంబాడీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. కానీ కొందరు రాజకీయ నాయకులు అవగాహన లేకుండా తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు.
మన సమాజంలో చట్టాలపై అవగాహన పెంపు అత్యవసరం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు మహేందర్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య రాజు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రమేష్ నాయక్, రైతు సేన జిల్లా అధ్యక్షులు మూడవత్ రాజు నాయక్, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత, భాను బిక్షపతి నాయక్, జూమ్లాన్ నాయక్, ధరావత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.