23-09-2025 10:57:37 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని మైహోమ్ అంకురా కాలనీలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తొలి రోజు మల్లెపల్లి బుచ్చి రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి, ధూపదీపాలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, బతుకమ్మ ఆటపాటలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి భక్తులను అలరించారు. కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి వినాయక చవితి, దసరా, క్రిస్మస్, రంజాన్ వంటి పండుగలను కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తున్నామని వాసులు పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ పూజలతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.