23-09-2025 10:54:13 PM
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్ లోని వాణినికేతన్ గ్రూప్ ఆఫ్ కళాశాలల్లో మంగళవారం బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ముకరంపురలోని స్తానిక వాణికేతన్ డిగ్రీ పిజి కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల వేడుకలకు వాణికేతన్ విద్యాసంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ ఇలినాని దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నవదుర్గ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఇలినాని దీపిక మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సాంస్కృతిక ఉత్సవం అని తెలిపారు. విధ్యార్థులు పండుగల ద్వారా ఆనందాన్ని మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న విలువలను సైతం అర్దం చేసుకోవాలని సూచించారు.
సాంప్రదాయాలకు గౌరవమిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలన్నారు. అమ్మాయిల జీవితంలో పండుగల ప్రాధాన్యం ఎంతో గొప్పదని, బతుకమ్మ పండుగలో ఆడపడుచుల సంతోషం, ఐక్యత , సృజనాత్మకత ప్రతిఫలిస్తుందని వివరించారు. విద్యార్థులు తమ విద్యలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే కాకుండా సంస్కృతిని గౌరవించి సాంప్రదాయాలను నిలుపుకోవడమూ ఎంతో అవసరమన్నారు.దసరా నవరాత్రులు ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని, ఈ విలువలను జీవితంలో అవలంబించాలని విధ్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విధ్యార్థినులు తీరొక్కపూలతో వివిధ ఆకర్షణీయమైన బతుకమ్మలను పేర్చారు.
బతుకమ్మల ఆక`తిలో వారి సృజనాత్మక కనిపించింది. అనంతరం విధ్యార్థినులు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ సాంప్రదాయ గీతాలను ఆలపించారు. అధ్యాపకులు సైతం విధ్యార్థులతో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించి బతుకమ్మ, విధ్యార్థినుల ఆనందోత్సాహం, సాంస్కృతిక వాతావరణం మొత్తం కళాశాలను పండుగ వాతావరణంగా మార్చాయి. ప్రతి యేటా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీతో పాటు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నట్లు యాజమాన్యం పేర్కొంది.