23-09-2025 11:53:46 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సెస్ యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆయేషా సిద్దఖా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎస్వీసీపీఎంసీ చైర్పర్సన్ బండారి రాణి హాజరైనారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా అనాదిగా వస్తున్న బతుకమ్మ పండుగ వేడుకలను యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలను కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ బండారి రాణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళా గౌరవానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థుల్లో సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల ఉద్దేశమని తెలిపారు. కళాశాల యాజమాన్యం తరఫున అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.