24-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జీ) సభ్యులకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చీరలను రేవంతన్న కానుకగా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు సంవత్సరానికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని 18 సంవత్సరాలు నిండిన, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసిన విషయం విధితమే. గత ప్రభుత్వం రేషన్ కార్డులో పేరున్న ప్రతీ మహిళకు రేషన్ డీలర్ల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ పథకం కింద అందించిన చీరలు నాణ్యతగా లేవని మహిళలు వీటిని ధరించడం లేదని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం గత బతుకమ్మ పండగకు చీరల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది.
దీంతో ప్రభుత్వంపై మహిళల కొంత వ్యతిరేకత వస్తుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈ పథకాన్ని ఈ ఏడాది కొన సాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరెలు అందించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పంపిణీ ప్రక్రియను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మహిళలకు రేవంతన్న కానుక..
అక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక పేరిట చేనేత చీరలను ఇందిరా మహిళ శక్తి పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే డ్రెస్ కోడ్ లో భాగంగా వారికి దసరా పండును పురస్కరించుకొని రెండేసి చీరెలను పంపిణీ చేయాలని నిర్ణ యించింది. నాణ్యత విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చీరెలను జిల్లాలోని మండలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో విడతల వారీగా చీరెలు రానున్నాయి. అయితే చీరెలను ఎక్కడ భద్రత పరిచేది స్టాక్ పాయింట్ల వివరాలను ప్రభుత్వం ముందే తెప్పించుకుంది.
జిల్లాలోని 7 మండల సమాఖ్యలను చీరలను నిల్వ చేసేందుకు ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి మండలాల్లోని స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. మండలాల్లో చీరలను నిల్వ చేసే స్టాక్ పాయింట్లను ఇప్పటికే గుర్తించారు. ఇక్కడి నుంచి గ్రామాల వారీగా ఎస్ హెచ్ జీ సభ్యులకు అందించనున్నారు. గతంలో రేషన్ కార్డు ఆధారంగా అందించగా ప్రస్తుతం స్వశక్తి సభ్యుల వారీగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో 2 లక్షల కు పైగా మహిళా సంఘాల సభ్యులు..
ఇప్పటికే జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఎన్ని సంఘాలు ఉన్నా యి.? ఎంత మంది సభ్యులు ఉన్నారు.? అనే లెక్కలు తీశారు. అంతే గాకుండా మెప్మా సిబ్బందికి పంపిణీ బాధ్యతలను అప్పగించారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,79,417 మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 24,272 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 2,03,689 మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.
వీరందరికి చీరల పంపిణీ జరగనుంది. డ్రెస్ కోడ్ లో భాగంగా అన్నీ ఒకే రంగుతో ఒకే విధంగా ఉంటాయి. మహిళా సంఘాల సభ్యులకు సంవత్సరానికి రెండేసీ చీరలు పంపిణీ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం ప్రస్తుతం ఒక చీర నే పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు చీరలను ఇవ్వడం ఇదే మొదటి సారి. గత సంవత్సరం ఇవ్వలేదు.
అంతకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు కూడా చీరెలను పంపిణీ చేసేది. మెప్మా సభ్యులకు కూడా చీరెలను పంపిణీ చేస్తారు. మహిళకు రెండు రకాల చీరలను అందిస్తుండగా ఇందులో ఆరున్నర మీటర్ల చీరలు, 9 మీటర్ల చీరలు ఉంటాయి. చీరల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందించనున్న చీరలు చేనేతవి కావడమే కాకుండా చాలా మన్నికగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్క చీర సుమారు రూ. 800 విలువ ఉంటుందని చెబుతున్నారు.
ఎస్ హెచ్ జీ సభ్యులకు పంపిణీ చేసే చీరెలను రాష్ట్రంలోని వరంగల్ జిల్లాతో పాటు కరీనగర్, సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో తయారు చేయించారు. టెస్కో పెట్టిన ఆర్డర్ ప్రకారం ఆ సంస్థ ఇచ్చిన డిజైన్, రంగుల మేరకే చీరలను నేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఎంపిక చేసిన డిజైన్లలో చీరలు తయారయ్యాయి.
స్వయం సహాయక మహిళల్లో హుషారు..
మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను రేవంతన్న కానుకగా అందించేందుకు ఏర్పాట్లు చేయడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.