24-07-2024 01:50:27 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో వర్షం కురిసిన ప్రతిసారి రహదారులపై నీరు నిలిచి, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 141 ప్రాంతాల్లోని రోడ్లపై వర్షపు నీరు, వరద నిలుస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో రాజ్ భవన్ రోడ్డుతో సహా అసెంబ్లీ, సీఎం క్యాంప్ ఆఫీస్, అమీర్‌పేట మైత్రీవనం, ఖైరతాబాద్ కేసీపీ జంక్షన్, లక్డీకాపూల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి, ముసారాంబాగ్ ఉన్నాయి. అయితే బస్తీలు, చిన్న చిన్న కాలనీల్లోని అంతర్గత రహదారులను అధికారులు విస్మరించినట్టుగా తెలుస్తున్నది.
పంజాగుట్ట మాదిరిగా..
గతంలో పంజాగుట్ట మోడల్ హౌజ్ వద్ద నీరు నిల్వడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాలా సాఫీగా పారుదల కోసం పెద్ద పైప్‌లైన్లను మార్చడమే కాకుండా, రోడ్డుపై అత్యధిక క్యాచ్‌పిట్‌లను ఏర్పాటు చేసి, సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు. ఇదే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి చర్యలు చేపట్టాలని నగరవాసులు భావిస్తున్నారు.
హైడ్రా స్పెషల్ ఫోకస్
గ్రేటర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజిస్టార్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) స్థానం లో హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ను ప్రభుత్వం కొత్త గా ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఐఏఎస్‌ల బదిలీలో ఈ విభాగానికి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈవీడీఎం స్థానం లో హైడ్రా అధికారికంగా విధులు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
గ్రేటర్‌లోని జోన్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులతో పాటు వివిధ పనులు చేపట్టే కాంట్రాక్టర్లతో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద తక్షణ చర్యల కోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుండటంతో కలుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు ప్రజల సమస్యలను వివరిస్తున్నారు. చెత్త నిలిచిపోతున్న ప్రదేశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనరే అధికారులకు గుర్తు చేయడం విశేషం. ఇలా హైడ్రా చేపడుతున్న ప్రత్యేక చర్యలతో వాటర్ లాగింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని నగరవాసులు ఆశిస్తున్నారు.