25-09-2025 06:25:24 PM
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బాలనాగు
కరీంనగర్,(విజయక్రాంతి): నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బాలనాగు అన్నారు. "స్వచ్ఛత హీ సేవ" కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ బిజినెస్ కార్యాలయ అధికారులు సిబ్బందితో కలిసి 'ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్' నినాదంతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడడాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏడాదిలో 100 గంటలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రమదానం కోసం వెచ్చిస్తామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 వ్యాపార ప్రాంతీయ కార్యాలయాలు, 934 శాఖలతో కొనసాగుతున్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలో చురుకుగా పాల్గొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం 50%, ఎస్బిఐ 35%, రాష్ట్ర ప్రభుత్వం 15% వాటాతో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందిస్తున్న టీజీబి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 73,791 కోట్ల వ్యాపారంపై 675 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిందన్నారు. 'స్వచ్ఛత హి సేవ' కార్యక్రమంలో భాగంగా వర్షాన్ని లెక్కచేయకుండా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెదారాలను తొలగించారు.