calender_icon.png 15 September, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్ధరామయ్యకు కొత్త చిక్కు

18-08-2024 12:00:00 AM

కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. గత కొంతకాలంగా కాంగ్రెస్, బీజెపీ మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమవుతూ వచ్చిన  మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కేసులో సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోను న్నారు. ముఖ్యమంత్రిపై విచారణకు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. ముడా కుంభకోణంంలో సీఎం సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కొంతమంది సామాజిక కార్యకర్తలు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. సీఎం, ఆయన సతీమణి, అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం సతీమణి హస్తం ఉందని బీజేపీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఫిర్యా దు వచ్చింది.

ఇంతకీ ముడా కుంభకోణం ఏమిటి? దానికీ, సీఎం సతీమణికి సంబంధం ఏమిటి? మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడెకరాల పొలం ఉంది. దాన్ని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. దానికి పరిహారంగా విజయనగర ప్రాం తంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని భూమితో పోలిస్తే ఈ భూమి మార్కెట్ విలువ చాలా ఎక్కువ. అదే బీజేపీ విమర్శలకు కారణమయింది. అయితే ఆ పార్టీ హయాంలోనే ఈ ప్లాట్ల కేటాయింపు జరిగింది. దీనిపై గతంలోనే సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. తనకు, రాష్ట్రానికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు.

తమ భూమిని ముడా తీసుకుందని, తన సతీమణి పరిహారానికి పూర్తిగా అర్హురాలని అన్నారు. 2004లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరిహారం కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారని, అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానని అన్నారు. దాంతో 2021లో మరోసారి దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వంభూమి కేటాయించిందని చెప్పారు. మార్కెట్ విలువ ఎక్కువగా ఉందని భావిస్తే దాన్ని వెనక్కి తీసుకుని తన భార్యకు పరిహారాన్ని ఇవ్వాలని చెప్పారు. 

కాగా తాను రాజీనామా చేసేంత తప్పు ఏమీ చేయలేదని తాజాగా సీఎం చెప్పారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్టవ్యతిరేకమని ఆయన ఆక్షేపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీ(ఎస్) చేస్తోన్న కుట్ర ఇదని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రివర్గం, పార్టీ అధిష్ఠానం, రాష్ట్రం సీఎంకు అండగా ఉన్నాయని ఆయ న అన్నారు. కేసే లేని చోట వివాదం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని డీకే చెప్పారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ దళితులనుంచి భూమిని లాక్కుందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ట్వీట్‌లో  ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు  సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్న లు తలెత్తుతున్నాయి. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నముఖ్యమంత్రులపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చిన చాలా సందర్భాల్లో  సీఎంలు అరెస్టయ్యారు. దాణా కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై విచారణకు అప్ప టి రాష్ట్ర గవర్నర్ కిద్వాయ్ అనుమతి  ఇవ్వడంతో  కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది.

అలాగే 2011లో బీఎస్ యెడ్యూరప్ప కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోష్ హెగ్డే నేతృత్వంలోని లోకాయుక్త ఆయనపై అవినీతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పటి గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ ఆయనపై విచారణకు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయన అరెస్టు కావడం, పదవిని కోల్పోవడం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం మధుకోడా కూడా అవినీతి ఆరోపణలపై అరెస్టయిన వారే. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య కూడా అరెస్టవుతారా అన్న వార్తలు వస్తున్నాయి.