calender_icon.png 19 December, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముట్టడి.. కట్టడి X నాంపల్లిలో రణరంగం

19-12-2025 12:41:38 AM

ముట్టడి.. కట్టడి

బీజేపీ అఫీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతల యత్నం 

గాంధీభవన్ గేటు ముసేసిన భద్రతా దళాలు

అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు 

  1. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం
  2. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు
  3. పలువురు మహిళా నేతలను అరెస్టు చేసిన పోలీసులు 
  4. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : నేషనల్ హెరాల్డ్ పత్రిక వ్యవహా రంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రా హుల్‌గాంధీపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి నగరంలో ఉద్రిక్తంగా మారింది. ఈ కేసును కొట్టి వేస్తూ కో ర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఆఫీసుల ముందు నిరసనగా పీసీసీ పిలుపుని చ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ చేపట్టిన నిరసనతో గాంధీభవన్, బీజేపీ ఆఫీసుల వద్ద భా రీగా పోలీసులు మోహరించారు.

గాంధీభవన్ నుంచి బీజేపీ కార్యాల యానికి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలను గాంధీభవన్ గేటు వద్దనే అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. మీనాక్షినటరాజన్, మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు  పార్టీ నాయకులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీభవన్ మెయిన్ గేట్‌ను పోలీసులు మూసేశారు. మరి కొందరు కార్యక ర్తలు పోలీసుల నుంచి తప్పించుకుని బీజేపీ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. అప్పటికే బీజేపీ కార్యాలయం చుట్టూ పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు.

బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు కూడా బయ టికి వచ్చి.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెద రగొట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై తప్పుడు కేసులు పెట్టిన బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్  

నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి బీజేపీకి ఏమి తెలియదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ విమర్శించారు. గాంధీ కుటుంబంపై నరేంద్రమోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. న్యాయం గెలవడానికి సమయం పట్టొచ్చని, కానీ చివరకు గెలిచేది సత్యమనే విషయం మర్చిపోవద్దని ఆమె హితవు పలికారు. గాంధీభవన్ ఆవరరణలోనే మీనాక్షినటరాజన్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు.

బీజేపీ పెడుతున్న అక్రమ కేసుల గురించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్గమే అహింస మార్గమని, అందుకే శాంతియుతంగా నిరసనలు చేపట్టి బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ .. సోనియా, రాహుల్‌గాంధీలపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి .. ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

ఢిల్లీ కోర్టులో ఈడీ వేసిన చార్జిషీట్‌ను కొట్టివేసిందన్నారు. దేశ స్వాతంత్య్రం నాటి నుంచి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని తెలిపారు. అలాంటి కుటుంబాన్ని బీజేపీ కావాలనే వేధింపులకు గురి చేస్తోందని మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ఇదే అంశాన్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్లుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలు శాంతియుతంగానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

నాంపల్లిలో రణరంగం

  1. కర్రలతో బీజేపీ కార్యకర్తల వీరంగం
  2. కాంగ్రెస్ ర్యాలీపై దాడికి యత్నం.. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి
  3. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. భారీగా స్తంభించిన ట్రాఫిక్.. వాహనదారుల ఇక్కట్లు

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 18 (విజయక్రాంతి):  హైదరాబాద్  నాంపల్లిలో గురువారం రణరంగాన్ని తలపించింది. రాజకీయ నిరసన కాస్తా భౌతిక దాడుల వరకు వెళ్లేలా పరిస్థితులు మారిపోయాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా బీజేపీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. శాంతియుతంగా సాగుతుందనుకున్న ర్యాలీ.. బీజేపీ కార్యకర్తలు కర్రలతో రోడ్డెక్కడంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 

కొంతమంది బీజేపీ కార్యకర్తలు చేతిలో లాఠీలు, కర్రలు పట్టుకుని గేటు దాటి బయటకు దూసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతు లకు గురిచేసేలా కర్రలను గాల్లో తిప్పుతూ వారిపైకి వెళ్లే ప్రయత్నం చేశారు. మా ఆఫీస్ వైపు వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంతే దీటుగా బదులివ్వడంతో పరిస్థితి చేజారిపోయేలా కనిపించింది. పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు భారీ సంఖ్య లో మోహరించారు.

బీజేపీ కార్యకర్తలు కర్రలతో దాడికి ప్రయత్నించగానే.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాల మధ్య ఒక హ్యూమన్ వాల్ లా నిలబడ్డారు. కర్రలతో దూసుకొస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. వారి చేతుల్లోని కర్రలను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి రాకుండానే, ఆందోళనకారులను వెనక్కి నెట్టివేశారు.

బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ ముందుకు రాకుండా నిలువరించారు. సుమారు గంట సేపు నాంపల్లి ప్రధా న రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి, అసెంబ్లీ వైపు వెళ్లే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.  పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు పలువురు ఆందోళనకారు లను అదుపులోకి తీసుకున్నారు.