03-01-2026 12:00:00 AM
ఐదేళ్లలో పెరిగిన ఓట్ల సంఖ్య 9,064
2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 55, 101
ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 64 ,165
ఆర్మూర్, జనవరి 2 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఐదేళ్ల కాలంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 201920 ఏడాదిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యతో ప్రస్తుతం మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ల సంఖ్యతో పోల్చితే 9,064 మంది ఓటర్ల సంఖ్య పెరిగింది. దీంతో పట్టణ ఓటర్ల జాబితాపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 201920 ఏడాదిలో ఆర్మూర్తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనం చేసిన పెర్కిట్ కొటార్మూర్, మామిడిపల్లి గ్రామాలతో కలిపి 55,101 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 26,650 మంది ఉండగా మహిళా ఓటర్లు 28,449 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.
కాగా గురువారం ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్ పూజారి శ్రావణి విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్లు 64,165 ఉండగా అందులో పురుషులు 30,735 మంది, మహిళలు 33,428 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఓటర్ల నమోదు వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల పాటు ఫిర్యాదులు, వినతులు స్వీకరించి ఈ నెల10వ తేదీ నాటికి తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది.
అయితే ఈ జాబితాలో మరణించిన వారి ఓట్లు, ఇతర ప్రాంతాలకు వలస వెల్లిన వారి ఓట్లు, ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం ఆర్మూర్కు వచ్చి ఇక్కడ ఓటు హక్కు పొందిన వారి ఓట్లు తొలగించని కారణంగా ఓటరు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, బీఆర్‌ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఇదివరమే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేసి కమీషనర్కు వినతి పత్రాలు సైతం సమర్పించారు. మరో వైపు కోత్త ఓటరు నమోదు ప్రక్రియ, ఓటు బదిలీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో ఆర్మూర్ పట్టణంలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం సైతం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.