22-12-2025 02:29:09 AM
ఇక్కడ ఎస్‌ఐఆర్ అమలును విజయవంతం చేయాలి
జనాభాలో కెనడా కంటే తెలంగాణ పెద్దది
ఇక్కడ ఓటరు జాబితా సవరణ ఆషామాషీ కాదు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 21 (విజయక్రాంతి): ‘తెలంగాణ రాష్ట్రంలోనూ సర్(ఎస్‌ఐఆర్)ను అమలుచేస్తాం. ఓటరు జాబితా పారదర్శకతలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి. జనాభా పరంగా కెనడా దేశం కంటే తెలంగాణ పెద్దది.. ఇక్కడ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా సవరణ ఆషామాషీ కాదు’ అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యా నించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బూత్ లెవల్ అధి కారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రా ల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలవుతోందని సీఈసీ తెలిపారు. త్వరలోనే తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్ అమలు చేస్తామని ప్రకటించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్వోలదేనని, ఈ ప్రక్రియను విజయవంతం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధిగమించి, పక్కాగా జాబితాను రూపొందించాలన్నారు.
సీఈసీ సమావేశం కాస్త గందరగోళం
మరోవైపు, సీఈసీ సమావేశం కాస్త గందరగోళానికి దారితీసింది. అధికారుల ప్రణాళిక లోపం వల్ల బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రవీంద్రభారతి ఆడిటోరియం సీటింగ్ కెపాసిటీ 500 కాగా, అధికారులు ఏకంగా వెయ్యి మందికి పైగా బీఎల్వోలకు ఆహ్వానం పంపారు. దీంతో సగం మందికి పైగా లోపల సీట్లు దొరక్క ఇబ్బంది పడ్డారు. సరిపడా సీట్లు లేకపోవడంతో చాలామంది బయటే నిలుచున్నారు. దీంతో బీఎల్వోలు ఆందోళనకు దిగారు. సామర్థ్యానికి మించి ఎందుకు పిలిచారు? కనీస ఏర్పాట్లు చేయ రా? అంటూ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళంతో సమావేశం ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.