calender_icon.png 10 May, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబిల్ ఉంటేనే యువవికాసం

10-05-2025 02:01:04 AM

  1. లబ్ధిదారుల ఎంపికలో క్రెడిట్ స్కోరే కీలకం
  2. లోన్ రీపేమెంట్ తనిఖీలో సిబిల్ స్కోర్ తప్పనిసరి అంటున్న బ్యాంకర్లు
  3. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా దరఖాస్తు
  4. సమీపిస్తున్న తుది జాబితా గడువు
  5. ఆందోళనలో దరఖాస్తుదారులు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు మంజూరు చేసి, నిరుద్యోగులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సాయంతో రుణం పొందాలనుకొనే యువతకు క్రెడిట్ స్కోర్ పెద్ద సవాల్ మారుతుంది.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, లేదా గతంలో రుణాలు తీసుకొని చెల్లించకపోయినా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత సాధించాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ బాగుండాలని అధికారులు చెబుతున్నారు. లోన్ అప్లికేషన్‌కు ముందు సిబిల్ స్కోర్‌ను రుణం మంజూరు చేసే బ్యాంకర్లు పరిశీలించనున్నారు. 

సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు..

దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్‌ను పరిశీలించేందుకు బ్యాంకర్లు రూ.100 నుంచి  రూ.200 వరకు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సిబిల్ స్కోర్ చెకింగ్ కోసం వసూలుపై ప్రభుత్వం స్పందించింది. తక్కువ ఆదాయవర్గాల అభ్యర్థులపై భారం పడకుండా చూడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వసూలు చేసే ఫీజును మినహాయించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. అయితే ఈ అంశంపై అధికారులు, బ్యాంకర్లతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

ఆవిర్భావానికి ప్రారంభించే యోచన

రాష్ర్టవ్యాప్తంగా యువ వికాసం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా 16,25,441 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 రాగా, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తు తం మండల స్థాయిలో దాదాపు 70 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

తుది జాబితా మే నెలాఖరులో అందుబాటులోకి రానుంది. మండల అధికారులు పరిశీలించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించిన తర్వాత అర్హుల ఎంపిక జరుగుతుంది. తుది జాబితా తయారైన తర్వాత కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాల మంజూ రు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం అందించేలా చర్యలు చేపట్టినట్టు సమాచారం. 

ఆందోళనలో దరఖాస్తుదారులు..

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో భాగంగా నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రూ.4 లక్షల వరకు సబ్సడీ రుణాలను అందించే లక్ష్యంతో రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.50 వేల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రూ.40 వేలు సబ్సిడీగా, మిగిలిన రూ.10 వేలు రుణంగా బ్యాంకర్ల నుంచి లభిస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 80 శాతం సబ్సిడీ కింద రాగా, మిగిలిన మొత్తం బ్యాంకర్ నుంచి వస్తుంది.

రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 70 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. మిగిలిన మొత్తం రుణంగా బ్యాంకర్ అందిస్తుంది. అయితే ఏ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నా బ్యాంకర్ నుంచి కొంత రుణం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల అనుమతి తప్పనిసరి అయ్యింది.

సబ్సిడీ పోగా మిగిలిన మొత్తం రుణాలు బ్యాంకర్ల మం జూరు చేయాల్సి ఉండగా, సిబిల్ అంశం తెరమీదికి రావడం దరఖాస్తుదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. సిబిల్ స్కోర్ సరిగా లేని, గతంలో లోన్ తీసుకొని సరిగ్గా చెల్లించని దరఖాస్తులకు ఇది సవాల్‌గా మారింది. ప్రభుత్వం చొరవచూపి ఈ సమస్యను పరిష్కరించాలని యువవికాసం దరఖాస్తుదారులు కోరుతున్నారు.