calender_icon.png 4 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి నాటు వేసి.. సాగు మెలకువలు చెప్పిన ఏవో

03-01-2026 02:30:48 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): యాసంగి సీజన్లో వరి సాగుకు తీసుకోవాల్సిన మెలకువలను మహబూబాబాద్ జిల్లా సిరోల్ ఏ వో ఛాయా రాజ్ స్వయంగా వరి నాట్లు వేసి రైతులకు వివరించారు. యాసంగిలో ముఖ్యంగా ఏప్రిల్ సమయంలో పూత దశలో పంట ఉండి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని, గింజ పగలే గుణం ఏర్పడే అవకాశం ఉంటునందున, ఉష్ణోగ్రతలు పెరిగే ముందే మన పంటను ముగించుకోవాలన్నారు. మార్చి చివరికి, ఏప్రిల్ మొదటి వారంలో పంట కోతను పూర్తి చేసుకోవాలన్నారు. దీనివలన నూక శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దొడ్డుగింజ రకాలను పారబోయిలింగ్ చేస్తారు కాబట్టి, గింజ పగిలినప్పటికీ నూకశాతం తక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.

చలి ఎక్కువగా ఉండే రోజులలో, నారుమడిలో రాత్రిపూట నిండుగా నీళ్లు పెట్టి మరుసటి రోజు చల్లగా ఆయిన నీటిని పూర్తిగా తీసేయాలన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే రాత్రి సమయంలో యూరియా బస్తాలు గానీ టర్పాలిన్లు గాని నారుమడి మీద కప్పేసి మరుసటి రోజు తీసేయాలన్నారు. చలి ఎక్కువగా ఉంటే, భూమి నుండి పోషకాలు తీసుకునే అవకాశం మొక్కకు తక్కువగా ఉంటుంది కాబట్టి పై పాటున 19:19:19  అనే మిశ్రమాన్ని 5-10 గ్రా, నారు వయసు బట్టి లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. యాసంగిలో కాండం తొలిచే పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి, నారుమడిలో నారు చనిపోయే అవకాశం ఉంటుంది. కావున ఎకరానికి సరిపడే నారుమడికి అనగా రెండు గంటలకు నారు పీకే వారం రోజుల ముందు 800గ్రా కార్టప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వేసుకోవాలన్నారు.

యాసంగిలో వరిని నేరుగా విత్తె పద్ధతి

కూలీల ఖర్చు, కూలీల కొరతతో సకాలంలో నాట్లు వేసుకోవడం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉన్నచోట, అదేవిధంగా ఖర్చు కూడా అధికంగా భావించే రైతులు,  నేరుగా వరి విత్తనాలను డ్రమ్ సీడర్ ద్వారా వేసినట్లయితే ఇటు ఖర్చు ఆటు సమయం ఆదా అవుతుందన్నారు. పంట త్వరగా కోతకు వస్తుందని, దొడ్డి గింజ రకాలు అయితే 10-12 కిలోలు, సన్నగింజ రకాలు అయితే 8-10 కిలోలు ఎకరానికి సరిపోతుందన్నారు. నేరుగా వరి విత్తె పద్ధతిలో కలుపు సమస్య ఉంటుంది కాబట్టి, సకాలంలో కలుపు నివారణ చర్యలు చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందన్నారు.