calender_icon.png 5 January, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ నుంచే నేర్చుకున్నా..

04-01-2026 12:52:18 AM

  1. రాజకీయ జీవితంలో పోరాట పటిమ, చైతన్యం, తెగింపు.. అన్నీ ఇక్కడి నుంచే వచ్చాయి
  2. కొండగట్టు అంజన్న దయతోనే నాకు పునర్మజన్మ..
  3. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
  4. కొండగట్టులో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయానికి టీటీడీ నిధులు
  5. శంకుస్థాపన చేసిన పవన్‌కళ్యాణ్

కరీంనగర్/మాల్యాల, జనవరి 3 (విజయక్రాంతి): రాజకీయ జీవితంలో తనకు పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నుంచే వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వెల్లడించారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. మొదట హెలికాప్టర్ ద్వారా జేఎన్టీయూకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు.

ఆ తర్వాత టీటీడీ సహకారంతో రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయానికి పవన్‌కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తనకు పోరాడే ధైర్యాన్ని ఇచ్చిందని, ఈ ప్రాం త ప్రజల స్ఫూర్తే తనను ముందుకు నడిపించిందని చెప్పారు. అంజన్న సన్నిధే తనను కాపాడిందని పేర్కొన్నారు. కష్టకాలాల్లో ఆధ్యాత్మిక బలం తనకు అండగా నిలిచిందని అన్నా రు.

ఆంజనేయ స్వామి తమ ఇంటి ఇలవేల్పు అని ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని అన్నారు. గతంలో ఆలయ అధికా రులు తన దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే అభివృద్ధి పనులకు మాట ఇచ్చినట్లు తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దయతో రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షనీయం అన్నారు.

కొండగట్టు గిరి ప్రదక్షణకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే స్వయంగా కర సేవకుడిని అవుతానని మాట ఇచ్చారు. భవిష్యత్తులో సైతం ఆలయ అభివృద్ధికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొండగట్టుకు నిధులు కేటాయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆల యాల అభివృద్ధికి కృషి చేస్తున్నదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు.  గిరిప్రదిక్షణ తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కూడ రక్ష అని అన్నారు. కొండగట్టు గిరి ప్రదిక్షణ కి అందరం కలిసి కరసేవా చేద్దాం అని తెలిపారు. 

తిరుపతిలా అభివృద్ధి చేస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ 

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ పుణ్యక్షేత్రాల్లో ప్రధానమైన కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి వచ్చి దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయానికి టీటీడీ నిధులు అందివ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపా రు. కొండగట్టు అలయ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. దీక్ష విరమణ, దర్శనం కోసం వచ్చే భక్తులకు గదుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేశామని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

పవన్‌కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే  మేడిపెల్లి సత్యం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ.. కొండగట్టులో పవన్‌కళ్యాణ్ సహకారంతో రూ.35.19 కోట్లతో దీక్ష విరమ ణ మండపం, 96 గదుల వసతి సముదాయానికి టీటీడీ నిధులు అందివ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకున్న పవన్ కళ్యాణ్‌కు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి మరింత అభివృద్ధి చేయడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

చంద్రబాబు సహకారంతో..: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

టీటీడీ తరఫున కొండగట్టులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పవన్‌కల్యాణ్ టీటీడీకి లేఖ రాశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయు డు చెప్పారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఆమోదం తెలిపారని చెప్పారు. ఆ తర్వాత టీటీ డీ బోర్డు సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టులో అనేక అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టీటీడీ బోర్డు మెంబర్లు బి ఆనంద సాయి, బి మహేందర్‌రెడ్డి, టీటీడీ ఎల్‌ఎసీ చైర్మన్ ఎన్ శంకర్‌గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు.

గెలుపు ఓటములు సహజం

అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్‌కళ్యాణ్ మాట్లా డారు. వంద మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుందని, రాజకీయాల్లో గెలుపుఓటములు సహజమని, అయితే పోటీ చేయడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందు ఉండాలని పిలుపునిచ్చారు. ఓటమికి భయపడకుండా పోటీ చేసే మనస్త త్వం జనసేనలో పెరగాలని సూచించారు.

వ్యక్తిగతంగా ఎవ్వరూ తనకు శత్రువులు కాదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. తమ పోరాటం వ్యక్తులపై కాదని, పాలసీ ప్రకారమే జరుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, సరైన విధానాల కోసం మాత్రమే తాము రాజకీయాల్లో పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసైనికులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉందని అన్నారు.